Tesla: భారత్‌లో టెస్లా కార్ల ధర ఎంత ఉండొచ్చు? దేశీయ కంపెనీలకు నిజంగా పోటీయేనా?

Eenadu icon
By Business News Team Published : 22 Feb 2025 13:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో దేశీయంగా తీసుకొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ కంపెనీ సీఎల్‌ఎస్ఏ ఓ నివేదికను విడుదల చేసింది. దిగుమతి సుంకాన్ని 20 శాతం కంటే దిగువకు తీసుకొచ్చినా టెస్లాలో చౌకైన కారు ధర రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం అమెరికాలో టెస్లా తన చౌకైన మోడల్‌ 3 కారు దాదాపు 35 వేల డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు)గా ఉందని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో తెలిపింది. భారత్‌లో దిగుమతి సుంకాల్ని 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్‌ ట్యాక్స్‌, బీమా వంటి అదనపు ఖర్చులు కలిపితే ఈ మోడల్‌ ధర 40 వేల డాలర్లు (సుమారు రూ.35-40 లక్షలు)గా ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ, హ్యుందాయ్‌ ఇ-క్రెటా, మారుతీ సుజుకీ ఇ-విటారా.. వంటి దేశీయ ఈవీ తయారీ సంస్థలు విక్రయించే మోడళ్లతో పోలిస్తే ధర 20-50 శాతం ఎక్కువే. కాబట్టి ప్రైస్‌ సెగ్మెంట్‌లో భారత్‌లోని ఈవీ సంస్థలకు ఇది పోటీగా నిలిచే అవకాశం లేదని నివేదిక అభిప్రాయపడింది.

ఒకవేళ టెస్లా రూ.25 లక్షల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీ-లెవల్‌ మోడల్‌ను భారత్‌లో తీసుకొస్తే.. అప్పుడు ఆ ధరలో కార్లను విక్రయిస్తున్న మహీంద్రా అండ్‌ మహీంద్రాతో టెస్లాకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతోనే నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంఅండ్‌ఎం షేర్లు నష్టపోయాయి. అయితే భారత్‌లో ఈవీ వినియోగం.. చైనా, యూరప్‌, అమెరికా కంటే తక్కువ ఉండడం వల్ల టెస్లా ఎంట్రీ భారత వాహన సంస్థలపై గణనీయమైన ప్రభావం చూపబోదని నివేదిక తెలిపింది. 

అంతేకాదు.. భారత్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్‌ 350 కంటే హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌440 ధర 20 శాతం అధికం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 నెలకు 28 వేల యూనిట్లు విక్రయాలు జరుగుతుంటే.. హర్లే బైక్స్‌ కేవలం నెలకు 1500 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో ధరను చాలా కీలకంగా పరిగణనలోకి తీసుకుంటారని నివేదిక అభిప్రాయపడింది. అందుకే పెద్దసంఖ్యలో కస్టమర్లను ఆకర్షించడం టెస్లాకు సవాలుగా మారుతుందని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు