Tesla: ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా

Tesla: ఇటీవలే చైనా, అమెరికా మార్కెట్లలో కార్ల ధరలను కుదించిన టెస్లా.. తాజాగా ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది.

Published : 22 Apr 2024 15:13 IST

Tesla | న్యూయార్క్‌: ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (FSD)’ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది. 12,000 డాలర్ల నుంచి 8,000 డాలర్లకు కుదించింది. కార్లపైనా కంపెనీ 2,000 డాలర్ల వరకు ధరల్ని తగ్గించిన విషయం తెలిసిందే. చైనా మార్కెట్‌కూ ఆ నిర్ణయాన్ని వర్తింపజేసింది. ఇలా వరుసగా ధరలు తగ్గించటం.. ఇతర కంపెనీల నుంచి టెస్లా ఎదుర్కొంటున్న పోటీని సూచిస్తోందని వాహనరంగ నిపుణులు తెలిపారు.

ఇటీవల టెస్లా (Tesla) విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు పోటీ కూడా తీవ్రమవుతుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లా ధరల కోత వ్యూహాన్ని అనుసరిస్తోంది. టెస్లా షేరు విలువ శుక్రవారం 150 డాలర్ల దిగువకు కుంగింది. 2024లో కంపెనీ స్టాక్‌ ధర ఇప్పటివరకు 40 శాతం మేర కుంగడం గమనార్హం. ఈ తరుణంలో కార్లు సహా ఎఫ్‌ఎస్‌డీ ధరలను తగ్గించడం గమనార్హం.

అమెరికా సహా వివిధ మార్కెట్లలో ఖరీదైన కార్లపై వెచ్చించడానికి కస్టమర్లు వెనకాడుతున్నారు. అధిక వడ్డీరేట్లే దీనికి కారణం. దీంతో టెస్లా (Tesla).. పాత కార్లను పెద్దగా అప్‌గ్రేడ్‌ చేయడం లేదు. అదే సమయంలో చైనాలో వివిధ కంపెనీలు అందుబాటు ధరలో కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. విక్రయాలు కుంగడం, పోటీ పెరగడంతో టెస్లా కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యలను సైతం చేపట్టింది. అందులోభాగంగా ఇటీవల 10 శాతం ఉద్యోగులను తొలగించింది.

ఏంటీ ఎఫ్‌ఎస్‌డీ?

టెస్లా మోడల్‌ కార్లన్నీ ‘ఆటో పైలట్‌’ మోడ్‌ ఫీచర్‌తో వస్తాయి. ఇది ఒక డ్రైవర్‌ అసిస్టెన్స్‌ వ్యవస్థ. ట్రాఫిక్‌ను బట్టి వేగాన్ని నియంత్రించడం, నిర్దిష్ట వరుసలోనే వెళ్లేలా కమాండ్ ఇవ్వడం వంటివాటిని కారు దానికదే చేసుకుంటుంది. ఈ ఆటోపైలట్‌ను మరింత అధునాతనంగా తీర్చిదిద్ది ‘ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌’ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. దీంట్లో డ్రైవర్‌ ప్రమేయం లేకుండానే పరిస్థితులకు అనుగుణంగా కారు కొన్ని పనులను సొంతంగా నిర్వహిస్తుంది. రోడ్డుపై ఒక వరుస నుంచి ఇంకో వరుసకు మారడం, పార్కింగ్‌, మొబైల్‌ యాప్‌తో కారును మూవ్‌ చేయడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను గుర్తించి తదనుగుణంగా నడుచుకోవడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.

కారు చుట్టూ ఉండే కెమెరాలు, అల్ట్రాసౌండ్‌ సెన్సర్ల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇవి కారులో ఉండే సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి కావాల్సిన ఔట్‌పుట్‌ను ఇస్తుంది. అందుకు అనుగుణంగా కారు ముందుకెళ్తుంది. అయితే, డ్రైవర్‌ పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి. ఏ క్షణంలోనైనా కారు సాఫ్ట్‌వేర్‌ దెబ్బతిని ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ఆ సమయంలో డ్రైవర్‌ వెంటనే కారును తన అధీనంలోకి తీసుకునేందుకు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. కేవలం డ్రైవర్‌పై ఒత్తిడిని తగ్గించడం, భద్రతను మెరుగుపర్చడంలో భాగంగానే ఎఫ్‌ఎస్‌డీని అభివృద్ధి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు