Wikipedia: వికీపీడియాలో భారత్‌ హవా..!

వికీపీడియాలో భారత్‌కు సంబంధించిన సమాచారం అందించే పేజీలకు వీక్షకుల సంఖ్య భారీగా నమోదైంది. భారత్‌లో భారీ సంఖ్యలో ఇంగ్లిష్‌ వికీపీడియా వాలంటీర్‌ ఎడిటర్స్‌ ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. 

Updated : 06 Dec 2023 18:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయు ఇంటర్నెట్‌ వినియోగదారులు వెబ్‌సైట్లలో ట్రెండ్స్‌ ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరుకొన్నారని వికీపీడియా పేర్కొంది. 2023లో వికీపీడియాలో అత్యధిక మంది వీక్షించిన పేజీల వివరాలను దాని మాతృసంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం తమ పేజీలకు 84 బిలియన్ల వీక్షణలు వచ్చాయని వెల్లడించినట్లు సీఎన్‌ఎన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ సారి కృత్రిమ మేధకు సంబంధించిన అప్‌డేట్లను తెలుసుకొనేందుకు ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపారని వివరించింది.

ఈ ఏడాది అత్యధికంగా కృత్రిమ మేధకు సంబంధించిన ‘ఛాట్‌జీపీటీ’ పేజీని అత్యధికంగా 4.94 కోట్ల మంది వీక్షించారు. ఈ ఏడాది ఛాట్‌జీపీటీ అత్యంత వేగంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. వినియోగదారులను అత్యంత వేగంగా పెంచుకొంటున్న సంస్థగా గత ఫిబ్రవరిలో రికార్డు సృష్టించింది. ‘‘ప్రజలు ఛాట్‌జీపీటీని వాడినప్పుడు.. దాని వెనుక టెక్నాలజీ చరిత్రను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారని అర్థమవుతోంది’’ అని వికీపీడియా మాతృసంస్థ వికీమీడియా ఫౌండేషన్‌ చీఫ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌ అనూషా అలీఖాన్‌ వెల్లడించారు. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు వికీపీడియాను, వికీమీడియా ప్రాజెక్టులను వాడుకొనేట్లు ఛాట్‌జీపీటీని తీర్చిదిద్దారన్నారు. ఇక భారత్‌లో తమకు 4,700 మంది ఇంగ్లిష్‌ వికీపీడియా వాలంటీర్‌ ఎడిటర్స్‌ ఉన్నారని ఆమె వివరించారు. ఈ అంశంలో మాత్రం అమెరికా, యూకే తర్వాతి స్థానంలో భారత్‌ ఉందన్నారు. 

  • ఛాట్‌జీపీటీ పేజీని అత్యధికంగా 49,490,406 మంది వీక్షించారు. 
  • ప్రముఖుల మరణాలను రికార్డ్‌ చేసే ‘డెత్స్‌ ఇన్‌ 2023’ పేజీని 42,666,860 మంది చూశారు. 
  • ‘2023 క్రికెట్‌ వరల్డ్‌కప్‌’ పేజీని 38,171,653 మంది సందర్శించారు. 
  • ‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ పేజీని 32,012,810 మంది చదివారు. 
  • ‘ఒపెన్‌హైమర్‌’ (హాలీవుడ్‌ చిత్రం) 32,012,810 వీక్షించారు. 

ఇక ఆ తర్వాత స్థానాల్లో టాప్‌-25లో ఉన్న వాటిల్లో ‘క్రికెట్‌ వరల్డ్‌ కప్‌’(6వ స్థానం),  ‘2023 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’(9వ స్థానం), జవాన్‌ (8వ స్థానం), పఠాన్‌ (10వ స్థానం), ‘ఇండియా’(21వ స్థానం) వంటి భారత్‌కు సంబంధించిన సమాచారం అందించే పేజీలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని