World Economy: 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు.. ఓఈసీడీ అంచనా!

World Economy: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఓఈసీడీ (OECD).. వచ్చే ఏడాది అది 2.7 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

Published : 29 Nov 2023 17:22 IST

World Economy | వాషింగ్టన్‌: ఈ ఏడాది బలమైన వృద్ధి రేటును నమోదు చేసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మాత్రం కుంగుబాటుకు గురవుతుందని ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (OECD)’ అంచనా వేసింది. యుద్ధాలు, ఎగువ స్థాయి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వెనక్కి లాగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఓఈసీడీ (OECD).. వచ్చే ఏడాది అది 2.7 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. కరోనా మహమ్మారితో అతలాకుతలమైన 2020 తర్వాత ఒక కేలండర్‌ ఏడాదిలో స్వల్ప వృద్ధి రేటు 2024లోనే నమోదవుతుందని అంచనా వేసింది. అలాగే వచ్చే సంవత్సరం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా వృద్ధి రేటు నెమ్మదించే అవకాశం ఉందని తెలిపింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ 2023లో 2.4%, 2024లో 1.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని ఓఈసీడీ (OECD) పేర్కొంది. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. అధిక వడ్డీరేట్ల వల్ల వినియోగదారులు, వ్యాపారులకు లోన్లు ఖరీదుగా మారాయని గుర్తుచేసింది. ఫలితంగా ద్రవ్యోల్బణం కట్టడి అయినట్లు తెలిపింది. ఏడాది అమెరికా ద్రవ్యోల్బణం 3.9 శాతం, 2024లో 2.2 శాతం, 2025లో 2 శాతానికి పడిపోతుందని ఓఈసీడీ అంచనా వేసింది.

మరోవైపు స్థిరాస్తి రంగ సంక్షోభం, నిరుద్యోగ సమస్యతో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న చైనా ఆర్థిక వ్యవస్థలో ఈ ఏడాది 5.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఓఈసీడీ (OECD) అంచనా వేసింది. వచ్చే ఏడాదికి అది 4.7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు దేశాలతో పాటు యూరో కరెన్సీని ప్రామాణికంగా తీసుకునే 20 దేశాల్లోనూ వృద్ధి నెమ్మదిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఈ దేశాల్లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.

2020 కరోనా మహమ్మారితో తలెత్తిన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వరుసగా సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం, వడ్డీరేట్ల పెంపు.. ఇలా వరుసగా సవాళ్లు ముంచుకొచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని