Online shopping: ఈ నగరంలోనే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ.. ఆదాయంలో 16శాతం దీనికే

online shopping: కరోనా వ్యాపించిన సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ షాపింగ్‌ యాప్‌లను ఏ నగర వాసులు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసా?

Published : 30 Jun 2023 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ (online shopping) చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. మన దేశంలో అమెజాన్‌ (Amazon), మీషో (Meesho)తో పాటు ఇతర షాపింగ్‌ యాప్‌లలో ఏ నగర ప్రజలు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసా? మన ఐటీ హబ్‌ బెంగళూరు వాసులు దీనిలో ముందున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫాం అమెజాన్‌లో అత్యధిక సమయం గడిపే నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.

సైబర్‌ మీడియా రీసర్చ్‌ (CMR) చేపట్టిన తాజా పరిశోధనలో ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు వాసులే అమెజాన్‌లో అధిక సమయం వెచ్చిస్తున్నారని పేర్కొంది. ఈ నగర ప్రజలు సగటున వారానికి నాలుగు గంటల రెండు నిమిషాలు దీనికి కేటాయిస్తున్నారని తన పరిశోధన ద్వారా వెల్లడించింది. ఇక ద్వితీయశ్రేణి నగరాల విషయానికొస్తే గువాహటి (Guwahati), కోయంబత్తూర్‌ (Coimbatore), లఖ్‌నవు (Lucknow) నగరవాసలు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు అధిక సమయం వెచ్చిస్తున్నారు. వీరు సగటున రెండు గంటల 25 నిమిషాలు గడుపుతున్నారు. ఈ సమయంలో వారు తమ ఆదాయంలో 16 శాతం వరకు ఇక్కడ ఖర్చుచేస్తున్నట్లు తేలింది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), మీషో, టాటా (Tata), రిలయన్స్‌ (Reliance) ఫ్లాట్‌ఫాంమ్‌లు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను పెంచుకోవటంలో అమెజాన్‌ ముందంజలో ఉన్నట్లు సీఎంఆర్‌ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానంలో ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) నిలిచింది. మహిళా వ్యాపారవేత్తలతో సహా ఇతరులూ ఈ-కామర్స్‌ సైట్లు లేదా యాప్స్‌లో ఏడాదికి సుమారు 149 గంటలు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 29 శాతం మంది ఆన్‌లైన్‌లో రూ.15,000 నుంచి 20,000 ధరల శ్రేణిలో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. టైర్‌-2 నగరాల్లోని ప్రజలు గత ఆరు నెలల్లో సగటున రూ.20,100 ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఖర్చు చేస్తుంటే, టైర్‌-1 నగరాల్లోని కొనుగోలుదారులు రూ.21,700 ఖర్చు చేస్తున్నారు. 

ఇక ఉత్పత్తుల విషయానికొస్తే.. దుస్తులు, యాక్సెసరీస్‌ను ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఇక, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో.. స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ బ్యాండ్స్‌ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. విద్యుత్తు ఉపకరణాలు ఎక్కువగా కొంటున్న నగరాల్లో నాగ్‌పుర్‌ (Nagpur) మొదటి స్థానంలో ఉంది. 18-30 ఏళ్ల మధ్య వయసున్న వారు 47శాతం, 23-45 ఏళ్ల మధ్య వయసున్న వారు 51శాతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. గత ఆరునెలల్లో  టైర్‌-2, టైర్‌-1 నగరాల్లోని 73 శాతం ప్రజలు అమెజాన్‌లోనే షాపింగ్‌ చేశారని అధ్యయనంలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని