Artificial intelligence: ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్‌ జుకర్‌బర్గ్‌ అంచనా!

Artificial intelligence: ఏఐకి డేటా కంటే విలువైనది మరొకటి ఉందని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. అదేంటి? ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..!

Updated : 22 Apr 2024 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్ సంస్థ మెటా ఇటీవల లామా-3 ఏఐ మోడల్స్‌ను విడుదల చేసింది. వాటిని వాట్సప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానం చేసింది. ఈసందర్భంగా భవిష్యత్తులో కృత్రిమ మేధ (Artificial Intelligence-AI) పనితీరును నిర్దేశించబోయే అంశమేంటో సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. అది డేటా మాత్రం కాదని స్పష్టంచేశారు.

‘‘ఏఐ మోడల్‌లో డేటా కంటే ఫీడ్‌బ్యాక్‌ లూప్‌లు చాలా విలువైనవిగా మారతాయని నా నమ్మకం’’ అని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) వెల్లడించారు. ఏఐ మోడల్స్‌ను ట్రైన్‌ చేయడం, మెరుగుపర్చడం కోసం ఫీడ్‌బ్యాక్ లూప్‌లను ఉపయోగిస్తారు. ఇవి గత ఔట్‌పుట్‌ల ఆధారంగా పని చేస్తాయి. తప్పులు జరుగుతున్న సమయంలో ఏఐ మోడల్స్‌కు వాటిని గుర్తు చేసి, అవగాహన కల్పించే అల్గారిథమ్‌లనే లూప్స్‌గా వ్యవహరిస్తారు. పనితీరును మెరుగు పర్చుకోవడానికి కావాల్సిన డేటాను కూడా అవి అందిస్తాయి. ఏఐ మోడల్స్‌ను ఉపయోగించడం, వాటిలోని లోపాలను గుర్తించడం, ఫీడ్‌బ్యాక్‌ రూపంలో వాటిని అందించి మెరుగుపర్చడమనే ప్రక్రియ భవిష్యత్తులో చాలా విలువైనదిగా మారుతుందని జుకర్‌బర్గ్‌ వివరించారు.

సింథటిక్‌ డేటా సైతం కీలకపాత్ర పోషిస్తుందని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) అన్నారు. వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి.. వాటిని పరిష్కరించేందుకు ఉన్న వివిధ పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. వాటిలో ఏది సత్ఫలితాలిస్తుందో కనిపెడతారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్నే సింథటిక్‌ డేటాగా వ్యవహరిస్తున్నారు. వాస్తవ రూపంలో ఆ సమస్య తలెత్తడం, దాన్ని పరిష్కరించడం జరగకపోయినప్పటికీ.. వాటిని ఊహించుకుని ముందే ఆయా పరిష్కారాలతో ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఈ సింథటిక్‌ డేటా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చాలా కంపెనీలు ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు