Stock Market today: బాబు భరోసా.. మార్కెట్లకు దిలాసా

ఇలా గత మూడు రోజుల్లో తీవ్ర హెచ్చుతగ్గులతో సూచీలు, మదుపర్లను ఒక ఆటాడుకున్నాయి.

Updated : 06 Jun 2024 07:15 IST

ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మద్దతుతో దూసుకెళ్లిన మార్కెట్లు
బ్యాంకింగ్, వాహన, చమురు షేర్లకు కొనుగోళ్లు
రూ.13.22 లక్షల కోట్లు పుంజుకున్న మదుపర్ల సంపద


జూన్‌ 3.. 

ఎన్‌డీఏకు పూర్తి మెజారిటీ అన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో 2507 పాయింట్ల లాభం

జూన్‌ 4.. 

భాజపాకు సాధారణ మెజారిటీ కూడా రాకపోవడంతో 4390 పాయింట్ల నష్టం

జూన్‌ 5.. 

ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడనుండటంతో 2303 పాయింట్లు పైకి


ఇలా గత మూడు రోజుల్లో తీవ్ర హెచ్చుతగ్గులతో సూచీలు, మదుపర్లను ఒక ఆటాడుకున్నాయి. చరిత్రలోనే అత్యధిక లాభాన్ని సోమవారం, అతిపెద్ద నష్టాన్ని మంగళవారం చవిచూసిన సెన్సెక్స్‌.. బుధవారం మళ్లీ భారీగా లాభపడింది. తక్కువ ధరల వద్ద ఆకర్షణీయంగా కనిపించిన షేర్ల కొనుగోలుకు మదుపర్లు ఉత్సాహం చూపడం ఇందుకు కారణం. ఎన్‌డీఏతోనే ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటల సమయంలో ప్రకటించాక.. సూచీలు దూసుకెళ్లాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడగా, నిఫ్టీ 22,500 పాయింట్ల ఎగువకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 77.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌ లాభపడగా, మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ బుధవారం ఒక్కరోజే రూ.13.22 లక్షల కోట్లు పెరిగి రూ.408.06 లక్షల కోట్ల (4.89 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. మదుపర్లు సోమవారం రూ.13.78 లక్షల కోట్ల మేర లాభపడగా, మంగళవారం రూ.31.07 లక్షల కోట్ల మేర నష్టపోయిన సంగతి విదితమే. 

సెన్సెక్స్‌ ఉదయం 73,027.88 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో తడబడిన సూచీ, 71,879.44 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం ఎన్‌డీఏ భాగస్వామిగా  ఉంటామంటూ తెదేపా విస్పష్టంగా ప్రకటించిన సమాచారం తెలియడంతోనే, కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు బలంగా పుంజుకున్నాయి. 74,534.82  వద్ద సెన్సెక్స్‌ గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 2303.19 పాయింట్ల లాభంతో 74,382.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 735.85 పాయింట్లు రాణించి 22,620.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 21,791.95 - 22,670.40 పాయింట్ల మధ్య ఈ సూచీ కదలాడింది. 

  • సెన్సెక్స్‌ లోని 30 షేర్లూ పరుగులు తీశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7.75%, టాటా స్టీల్‌ 6.55%, ఎం అండ్‌ ఎం 6.49%, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.10%, కోటక్‌ బ్యాంక్‌ 4.89%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.67%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4.62%, హెచ్‌యూఎల్‌ 4.27%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.20%, సన్‌ఫార్మా 3.75%, ఐటీసీ 4.30%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.56% చొప్పున మెరిశాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం 6.01%, సేవలు 5.74%, లోహ 5.36%, వాహన 4.50%, కమొడిటీస్‌ 4.48%, వినియోగ 4.29% పెరిగాయి. బీఎస్‌ఈలో 2560 షేర్లు లాభపడగా, 1261 స్క్రిప్‌లు నష్టపోయాయి. 97 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • నొవెలిస్‌ ఐపీఓ వాయిదా: ప్రతికూల పరిస్థితుల కారణంగా ఐపీఓను వాయిదా వేస్తున్నట్లు హిందాల్కో అమెరికా అనుబంధ సంస్థ నొవెలిస్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఎప్పుడు ఐపీఓ తీసుకురావాలో చూస్తామని బీఎస్‌ఈకి హిందాల్కో సమాచారమిచ్చింది. ఈ వార్తలతో ఇంట్రాడేలో రూ.608.40 వద్ద కనిష్ఠాన్ని తాకిన హిందాల్కో షేరు, మళ్లీ పుంజుకుని 7.41% లాభంతో రూ.694.80 వద్ద ముగిసింది. 
  • ట్రావెల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇక్సిగో ఐపీఓ ఈ నెల 10న ప్రారంభమై 12న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.88- 93 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.740 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 161 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.


ఎన్‌ఎస్‌ఈ ప్రపంచ రికార్డు

అత్యధిక లావాదేవీల పరంగా నేషనల్‌ స్టాక్‌   ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రపంచ రికార్డు సృష్టించింది. బుధవారం ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ఎన్‌ఎస్‌ఈ 1971 కోట్ల ఆర్డర్లు, 28.55 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు సంస్థ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ తెలిపారు.

  • సౌర విద్యుత్, బయోగ్యాస్‌ వంటి పునరుత్పాదక ఇందన ప్రాజెక్టులపై వచ్చే మూడేళ్లలో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 2023-24లో కంపెనీ ఈ విభాగంలో రూ.120.8 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
  • సాధారణ బీమా విభాగమైన కోటక్‌ మహీంద్రా జనరల్‌లో 70% వాటాను జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి విక్రయించేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చిందని కోటక్‌ బ్యాంక్‌ వెల్లడించింది.
  • ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు కొత్త ఛైర్మన్‌ను అన్వేషించే పనిని ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ప్రస్తుత ఛైర్మన్‌ శ్రీకాంత్‌ వైద్య పదవీకాలం ఆగస్టు 31తో ముగియనుంది. ఈ ఛైర్మన్‌ పదవికి అర్హుల నుంచి తాజాగా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా ఉంచింది.
  • క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 117.25 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 66,99,000 షేర్లను ఆఫర్‌ చేయగా, 78,54,49,390 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

అదానీ షేర్లు రయ్‌ రయ్‌

మంగళవారం భారీ నష్టాల నుంచి అదానీ షేర్లు కోలుకున్నాయి. బుధవారం బీఎస్‌ఈలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 11.01%, అదానీ పోర్ట్స్‌ 8.59%, అంబుజా సిమెంట్స్‌ 7.47%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6.02%, ఏసీసీ 5.20%, ఎన్‌డీటీవీ 3.26%, అదానీ టోటల్‌ 2.67%, అదానీ విల్మర్‌ 0.77%, అదానీ పవర్‌ 0.32% లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ మాత్రం 2.58% తగ్గింది. అదానీ గ్రూప్‌లోని 9 సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.15.57 లక్షల కోట్లుగా నమోదైంది.


ఈ కంపెనీలకు కలిసొచ్చింది 

ఎన్నికల ఫలితాలతో ఆకర్షణీయంగా పెరిగిన షేరు ధరలు
మదుపరులకు సత్వర లాభాలు 

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లోని రెండు కంపెనీల మార్కెట్‌ విలువ అతిత్వరగా, భారీగా  పెరిగింది. ఈ రెండు కంపెనీల్లో ఒకటి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కాగా, మరొకటి అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌. కొద్ది రోజులుగా ఈ కంపెనీల షేర్లపై స్టాక్‌ మార్కెట్లో మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. పనితీరు బాగా మెరుగుపడి, కొన్ని త్రైమాసికాలుగా అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేయడమూ కలిసొచ్చింది. ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరయ్యే కొద్దీ షేరు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఫలితాలు వెల్లడయ్యాక, ఒక్కసారిగా మదుపరులు ఈ షేర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. ఫలితంగా కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ షేర్లు మదుపరులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.


హెరిటేజ్‌ ఫుడ్స్‌

ఈ షేరు బుధవారం బీఎస్‌ఈలో 20% గరిష్ఠ పరిమితి (అప్పర్‌ సర్క్యూట్‌)ని తాకింది. బీఎస్‌ఈలో క్రితం రోజు ముగింపు ధర రూ.455.80 కాగా, బుధవారం రూ.546.95 పలికి, అక్కడే స్థిరపడింది. గత వారం రోజుల్లో ఈ షేరు రూ.390 నుంచి పెరుగుతూ వచ్చింది. ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాక, ఈ కంపెనీ షేరుకు మదుపరుల మద్దతు ఇంకా పెరిగింది. ప్రస్తుత షేరు ధర ప్రకారం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) రూ.5,075 కోట్లకు చేరుకుంది.


అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ

ఈ షేరు కూడా, ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ నెల 4న బీఎస్‌ఈలో ఒకదశలో రూ.1010 స్థాయికి చేరింది. ఆ తర్వాత కోలుకుని రూ.1083 వద్ద ముగిసింది. బుధవారం రూ.1111 వద్ద ఈ షేరు ట్రేడింగ్‌ మొదలై అనూహ్యంగా రూ.1232 గరిష్ఠ ధర పలికింది. చివరికి రూ.1216 ముగింపు ధర నమోదైంది. గత 6 నెలల్లో సంస్థ షేరు ధర దాదాపుగా రెట్టింపు అయింది. ప్రస్తుత ధర ప్రకారం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,255 కోట్లకు చేరింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని