Trump Tariffs: ట్రంప్‌ టారిఫ్‌లు.. బిలియనీర్లకు రూ.17లక్షల కోట్ల నష్టం

Eenadu icon
By Business News Team Published : 04 Apr 2025 16:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్‌ల (Trump Tariffs) దెబ్బకు అంతర్జాతీయంగా అనేక ఎక్స్ఛేంజీ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. అటు అమెరికా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ ఎఫెక్ట్‌ బిలియనీర్లపైనా తీవ్రంగానే పడింది. ప్రపంచవ్యాప్తంగా 500 మంది కుబేరుల మొత్తం సంపద (Billionaires Wealth) 208 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.17లక్షల కోట్లకు పైమాటే..! సంపన్నుల సంపద ఈ స్థాయిలో తరగడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆస్తి కూడా భారీగా తగ్గడం గమనార్హం.

  • ఈ జాబితాలో అత్యధికంగా నష్టపోయింది మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg). ఆయన సంపద ఏకంగా 17.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.5లక్షల కోట్లు) మేర ఆవిరైంది. జుకర్‌బర్గ్‌ మొత్తం సంపదలో ఈ నష్టం 9శాతానికి సమానం. ట్రంప్‌ (Donald Trump) టారిఫ్‌ల ప్రకటన తర్వాత అమెరికా మార్కెట్లలో మెటా కంపెనీ షేర్లు దాదాపు 8 శాతానికి పైగా పడిపోవడమే ఇందుక్కారణం.
  • ఇక, అమెజాన్‌ షేర్లు 9శాతం మేర కుంగాయి. 2022 ఏప్రిల్‌ తర్వాత ఈ కంపెనీ షేర్లు ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. దీంతో సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) వ్యక్తిగత నికర సంపద 15.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1.3లక్షల కోట్లు) తరిగిపోయింది.
  • టెస్లా షేర్లు 5.5శాతం మేర తగ్గడంతో ఎలాన్‌ మస్క్‌ సంపద 11 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.93వేల కోట్లు) మేర కరిగిపోయింది.
  • డెల్‌ సీఈఓ మైఖేల్‌ డెల్‌ సంపద 9.53 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 81వేల కోట్లు), ఒరాకిల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ల్యారీ ఎలిసన్‌ ఆస్తి 8.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.69వేల కోట్లు) మేర తగ్గింది.
  • ఎన్విడియా సీఈఓ జేసెన్‌ హువాంగ్‌కు 7.36 బిలియన్‌ డాలర్లు, గూగుల్‌ మాజీ సీఈఓ ల్యారీ పేజ్‌కు 4.79 బిలియన్‌ డాలర్లు, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌కు 4.46 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
  • ఫ్రాన్స్‌ సంపన్నుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద 6 బిలియన్‌ డాలర్లు తరిగిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ ఇండెక్స్‌ సూచీ వెల్లడించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని