Threads vs Twitter: ‘థ్రెడ్స్‌’పై దావా వేస్తాం.. మెటాను హెచ్చరించిన ట్విటర్‌

Threads vs Twitter: ఫేస్‌బుక్‌ మాతృక సంస్థ మెటా తీసుకొచ్చిన కొత్త యాప్‌ థ్రెడ్స్‌.. ట్విటర్‌కు ప్రధాన పోటీదారుగా మారుతోంది. దీంతో ఈ యాప్‌పై ట్విటర్‌ న్యాయపోరాటానికి దిగింది. ఈ యాప్‌ తమ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించిన ట్విటర్‌.. మెటాపై దావా వేసేందుకు సిద్ధమైంది.

Updated : 07 Jul 2023 10:33 IST

న్యూయార్క్‌: గత కొన్ని రోజులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)కు ఇప్పుడు ‘థ్రెడ్స్‌ (Threads)’ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ) తీసుకొచ్చిన ఈ కొత్త యాప్‌నకు విశేష ఆదరణ లభించింది. ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపు 5 కోట్లకు పైగా యూజర్లను సొంతం చేసుకొంది. అయితే, 24 గంటలు గడవకుముందే ఈ యాప్‌ న్యాయపరమైన సమస్యలో చిక్కుకుంది. ‘థ్రెడ్స్‌’ తమ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించిన ట్విటర్‌.. దానిపై దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ న్యాయవాది అలెక్స్‌ స్పిరో.. మెటా (Meta) సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Zukerberg)కు లేఖ రాశారు.

ఈ లేఖను అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. తమ సంస్థలో పనిచేసిన పాత ఉద్యోగులను మెటా నియమించుకుని తమ వాణిజ్య రహస్యాలు, ఇతర మేధోపరమైన అంశాలను తెలుసుకుందని ట్విటర్‌ ఆరోపించింది. చట్టవిరుద్ధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకుని నకలు యాప్‌ను తయారుచేసిందని ట్విటర్‌ ఆక్షేపించింది. ‘‘మేధోపరమైన అంశాల్లో ట్విటర్‌ (Twitter) నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ట్విటర్‌ వాణిజ్య రహస్యాలను, ఇతర రహస్య సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే దీనిపై న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది’’ అని అలెక్స్‌ స్పిరో ఆ లేఖలో హెచ్చరించారు.

పోటీ మంచిదే కానీ..: మస్క్‌

ఈ వార్తా కథనంపై ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌లో స్పందించారు. ‘‘పోటీ మంచిదే. కానీ, మోసం సరైన పద్ధతి కాదు’’ అని రాసుకొచ్చారు.

మేం ఎవర్నీ తీసుకోలేదు: మెటా

ట్విటర్‌ ఆరోపణలను మెటా (Meta) తీవ్రంగా ఖండించింది. ట్విటర్‌లో పనిచేసిన వ్యక్తులెవరినీ తాము తీసుకోలేదని వెల్లడించింది. ‘‘థ్రెడ్స్‌ (Threads) ఇంజినీరింగ్‌ టీమ్‌లో ట్విటర్‌ పాత ఉద్యోగులెవరూ లేరు. అదంత పెద్ద విషయం కూడా కాదు’’ మెటా అధికార ప్రతినిధి ఆండీ స్టోన్‌ థ్రెడ్స్‌లో పోస్ట్‌ చేశారు. గురువారం నుంచి థ్రెడ్స్‌ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా ఐరోపా సమాఖ్యలో మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు.

థ్రెడ్స్‌ vs ట్విటర్‌.. తేడాలివే:

అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లతో ఉండే ఈ థ్రెడ్స్‌ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసంధానంగా తీసుకొచ్చారు. అయతే, ట్విటర్‌తో పోలిస్తే థ్రెడ్స్‌లో కొన్ని తేడాలున్నాయి.

అయితే ట్విటర్‌ బ్లూ టిక్‌ ఉన్న ఖాతాదారులకు వెరిఫికేషన్‌, సుదీర్ఘ పోస్టులు, వీడియోలు, పోస్ట్ ఎడిటింగ్‌ వంటి సదుపాయాలున్నాయి. దీనికి నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని