‘థ్రెడ్స్‌’ అల్లుకుపోతోంది

ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ) కొత్త యాప్‌ ‘థ్రెడ్స్‌’ను తీసుకొచ్చింది. టెక్ట్స్‌ ఆధారిత ఈ యాప్‌ గురువారం ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది.

Published : 07 Jul 2023 01:04 IST

4 గంటల్లోనే 50 లక్షల ఖాతాలు
ట్విటర్‌కు పోటీగా.. అదే ఒరవడిలో

లండన్‌: ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ) కొత్త యాప్‌ ‘థ్రెడ్స్‌’ను తీసుకొచ్చింది. టెక్ట్స్‌ ఆధారిత ఈ యాప్‌ గురువారం ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగదార్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్‌ను ప్రారంభించిన తొలి 2 గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. తొలి 4 గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరగడం విశేషం. ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ‘సంభాషణలు జరిపేందుకు స్నేహపూర్వ పబ్లిక్‌ స్పేస్‌ ఇది. టెక్స్ట్‌ సంభాషణలు చేసుకునేవారికి కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రపంచానికి అవసరమైన స్నేహపూర్వక కమ్యూనిటీని థ్రెడ్స్‌ కల్పిస్తుంది’ అని జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా..

ట్విటర్‌ తరహా ఫీచర్లతో ఉండే ఈ యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చారు. కొత్త యాప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తమ యూజర్‌ నేమ్‌ కొనసాగించొచ్చు. ఇన్‌స్టాలో అనుసరిస్తున్న ఖాతాలను, ఇందులోనూ అనుసరించే సౌలభ్యం ఉంది. కాబట్టి త్వరలోనే ట్విటర్‌ ఖాతాదారుల సంఖ్యను ‘థ్రెడ్స్‌’ మించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీనిపై జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ.. ‘దీనికి కొంత సమయం పట్టొచ్చు. అయితే, వంద కోట్ల మంది ఖాతాదారులతో ఓ పబ్లిక్‌ కన్వర్జేషన్‌ యాప్‌ ఉండాలని నేను భావిస్తున్నా. ట్విటర్‌కు ఆ అవకాశం వచ్చినా.. అది సద్వినియోగం చేసుకోలేకపోయింది. మేం ఆ ఘనత సాధిస్తామని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు.

  • టెక్స్ట్‌ రూపంలో ఉన్న పోస్టులను థ్రెడ్స్‌లో లైక్‌ చేయొచ్చు. కామెంట్‌ చేయడంతో పాటు ఇతరులతో, ఇతర ప్లాట్‌ఫామ్‌లపైకి లింక్‌ రూపంలో పంచుకోవచ్చు.
  • ట్విటర్‌లో 280 అక్షరాల్లో పోస్ట్‌ చేసే వీలుంది. థ్రెడ్స్‌లో ఇది 500 అక్షరాలు. 5 నిమిషాల వరకు వీడియోను పోస్ట్‌ చేయొచ్చు.  

మస్క్‌ కౌంటర్‌..

పూర్తిగా ట్విటర్‌ను పోలినట్లుగా ఈ యాప్‌ను తీసుకురావడంతో ఓ నెటిజన్‌ మెటాపై వ్యంగ్యాస్తాల్రు గుప్పించారు. ‘థ్రెడ్స్‌ను తీసుకొచ్చేందుకు మెటా కీబోర్డులోని ‘కాపీ పేస్ట్‌’ సదుపాయాన్ని ఉపయోగించింది’ అని ఆ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి మస్క్‌ స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు.

11 ఏళ్ల తర్వాత ట్విటర్‌లోకి జుకర్‌బర్గ్‌

థ్రెడ్స్‌ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా మెటా అధినేత జుకర్‌బర్గ్‌ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఉదయం ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. 1967 నాటి స్పైడర్‌మ్యాన్‌ కార్టూన్‌ అది. అందులో విలన్‌.. హీరో మాదిరిగా ఒకే డ్రెస్సులో కన్పిస్తాడు. మస్క్‌ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్‌ షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. 2012 జనవరి 18న జుకర్‌ చివరిసారిగా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

  • అమెరికా, భారత్‌ సహా 100 దేశాల్లో థ్రెడ్స్‌ అందుబాటులోకి వచ్చింది. నియంత్రణ సమస్యల వల్ల థ్రెడ్స్‌ యాప్‌ ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని