X Premium: మరింత తక్కువ ధరకే ‘ఎక్స్‌’ ప్రీమియం ఫీచర్లు..కానీ..!

X Premium: ఎక్స్‌ ప్రీమియంలో రెండు రకాల సబ్‌స్క్రిప్షన్లను తీసుకొస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ శుక్రవారం ప్రకటించారు.

Updated : 20 Oct 2023 14:29 IST

X Premium | వాషింగ్టన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్‌’ను (Social Media X) సొంతం చేసుకున్నప్పటి నుంచి బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ అనేక మార్పులను తీసుకొచ్చారు. ఆ పరంపరను కొనసాగిస్తూ తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను అందించారు. ప్రీమియం పెయిడ్‌ సర్వీస్‌లో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇకపై రెండు రకాల ప్రీమియం ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం ఎక్స్‌ ప్రీమియం (X Premium) సేవల కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్‌లో ఇది రూ.900గా ఉంది. దీనికంటే తక్కువ ధరకే కొత్త ప్రీమియం ప్యాక్‌ను తీసుకురానున్నారు. అయితే, దీంట్లో వాణిజ్య ప్రకటన (Ads)లు ఉంటాయి. ప్రీమియం ఫీచర్లలో మాత్రం ఎలాంటి కోత ఉండదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకొచ్చారు. యాడ్స్‌ వచ్చినా ఫరవాలేదనుకుంటే.. ప్రీమియం ఫీచర్ల కోసం ఈ ప్యాక్‌ను పొందొచ్చు.

ఎక్స్‌ ప్రీమియంలో (X Premium) మరో అంచె వాణిజ్య ప్రటనలు ఏమాత్రం ఉండని సబ్‌స్క్రిప్షన్‌. ఈ ప్యాక్‌ను తీసుకున్నవారు ప్రీమియం ఫీచర్లతో పాటు ఏమాత్రం యాడ్‌లు లేని ‘ఎక్స్‌’ను ఎంజాయ్‌ చేయొచ్చు. ఫలితంగా టైమ్‌లైన్‌ ఎలాంటి యాడ్‌లులేకుండా కేవలం మీకు సంబంధించిన కంటెంట్‌తో మాత్రమే కనిపిస్తుంది. ప్రీమియం ఫీచర్లలో భాగంగా పోస్ట్‌లను ఎడిట్‌ చేయడం, సుదీర్ఘ పోస్ట్‌లు, నచ్చిన యాప్‌ ఐకాన్‌లు, కస్టమ్‌ నావిగేషన్‌, టాప్‌ ఆర్టికల్స్‌, రీడర్‌, అన్‌డూ పోస్ట్‌, సుదీర్ఘ వీడియో అప్‌లోడ్‌ వంటి సేవలను పొందొచ్చు. కొత్తగా తీసుకురాబోయే ప్లాన్ల ధరల వివరాలను మాత్రం మస్క్‌ వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని