Cab Services: రూ.27 అధిక వసూలు.. ఉబర్‌ ఇండియాకు రూ.28,000 జరిమానా

Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్‌ ఇండియాకు కన్జ్యూమర్‌ కమిషన్‌ రూ.28 వేలు జరిమానా విధించింది.

Updated : 18 Apr 2024 16:24 IST

చండీగఢ్‌: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ ఇండియాకు ఇటీవల ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌- చండీగఢ్‌’ రూ.28,000 జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడి నుంచి క్యాబ్‌ డ్రైవర్‌ రూ.27 అదనంగా తీసుకోవడమే దీనికి కారణం.

అదనంగా తీసుకున్న రూ.27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్‌గార్గ్‌కు రూ.5,000 పరిహారం, రూ.3,000 ఖర్చుల కింద చెల్లించాలని ఉబర్‌ ఇండియాను కమిషన్‌ ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలను అడ్డుకునేందుకు కమిషన్‌ లీగల్‌ ఎయిడ్‌ ఖాతాలో రూ.20,000 జమ చేయాలని తెలిపింది. కస్టమర్ల సమయాన్ని దృష్టిలోఉంచుకొని ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలా వ్యవహరించడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

పంజాబ్‌కు చెందిన గార్గ్‌.. 2022 సెప్టెంబరు 19న చండీగఢ్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ సమయంలో యాప్‌లో ఛార్జీ రూ.53గా చూపించింది. డ్రైవర్‌ మాత్రం ఏవేవో నిబంధనలు చెప్పి రూ.80 వసూలు చేశాడు. ఈ విషయాన్ని లీగల్‌ నోటీసులు, మెయిల్స్‌ ద్వారా ఉబర్‌ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. తాము యాప్‌ రూపంలో కేవలం టెక్నాలజీ సర్వీస్‌ మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చింది. డ్రైవర్లు, కస్టమర్లను అనుసంధానించడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రయాణ సేవలు అందించడం తమ పని కాదని పేర్కొంది. నిజమైన సర్వీస్‌ డ్రైవర్లదేనంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చింది.

ఉబర్‌ ఇండియా సమాధానంపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. డ్రైవర్‌ అధికంగా వసూలు చేస్తున్నాడని తెలిసి కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని తేల్చింది. కస్టమర్‌ చెల్లించే డబ్బుల్లో కొంత ఉబర్‌కు వెళ్తున్న నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. డ్రైవర్ల ప్రవర్తన సక్రమంగా ఉందో, లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కంపెనీదేనని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని