Unclaimed deposits: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయ్‌

గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 3.49% తగ్గి 44.42 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

Updated : 31 May 2024 04:04 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) 3.49% తగ్గి 44.42 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. సేవలు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌-సాఫ్ట్‌వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకు తక్కువ పెట్టుబడులు రావడం ఇందుకు నేపథ్యం. 2022-23లో 46.03 బి. డాలర్ల ఎఫ్‌డీఐ తరలి వచ్చింది. 2023-24 జనవరి-మార్చిలో 12.38 బి. డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2022-23 ఇదే కాలంలో వచ్చిన 9.28 బి. డాలర్ల ఎఫ్‌డీఐతో పోలిస్తే, ఇవి 33.4% అధికం.

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మొత్తం ఎఫ్‌డీఐ (ఈక్విటీలు, రీఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్, ఇతర మూలధనం) 1% తగ్గి 70.95 బి. డాలర్లుగా నిలిచాయి. 2022-23లో ఇవి 71.35 బి. డాలర్లుగా ఉన్నట్లు పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం (డీపీఐఐటీ) తెలిపింది. 2021-22లో అత్యధికంగా భారత్‌లోకి 84.83 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 

2023-24లో మారిషస్, సింగపూర్, అమెరికా, బ్రిటన్, యూఏఈ, జర్మనీ, సైప్రస్‌ నుంచి ఎఫ్‌డీఐ ఈక్విటీ నిధులు తగ్గాయి. అయితే నెదర్లాండ్స్, జపాన్‌ నుంచి పెరిగాయి. రంగాల వారీగా చూస్తే సేవలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌-హార్డ్‌వేర్, ట్రేడింగ్, టెలికాం, వాహన, ఫార్మా, రసాయనాల్లోకి తగ్గగా.. నిర్మాణ కార్యకలాపాలు, విద్యుత్‌ రంగాల్లోకి పెరిగాయి.

తెలంగాణకు పెరిగిన ఎఫ్‌డీఐలు: 2023-24లో మహారాష్ట్ర అత్యధికంగా 15.1 బి. డాలర్ల ఎఫ్‌డీఐను పొందింది. 2022-23లో ఈ మొత్తం 14.8 బి. డాలర్లుగా ఉన్నాయి. గుజరాత్‌కు 4.7 బి. డాలర్ల నుంచి 7.3 బి. డాలర్లకు ఎఫ్‌డీఐ పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌లూ ఎఫ్‌డీఐ విషయంలో వృద్ధిని నమోదు చేశాయి. కర్ణాటకకు 10.42 బి. డాలర్ల నుంచి 6.57 బి. డాలర్లకు పరిమితమయ్యాయి. దిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణాలకూ తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని