UPI: శ్రీలంక, మారిషస్‌కూ యూపీఐ సేవల విస్తరణ

UPI: గత వారం ఫ్రాన్స్‌లో ప్రారంభమైన యూపీఐ సేవలను తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించారు. 

Published : 12 Feb 2024 15:29 IST

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల సౌలభ్యం కోసం యూపీఐ (UPI) సేవలను ప్రభుత్వం క్రమంగా విదేశాల్లోనూ ప్రారంభిస్తోంది. ఇటీవలే ఫ్రాన్స్‌లో మొదలైన వీటిని తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన వర్చువల్‌ సమావేశంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘేతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. మారిషస్‌లో రూపే కార్డులను సైతం ప్రారంభించడం విశేషం.

శ్రీలంక, మారిషస్‌ ప్రజలతో భారత్‌కున్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ప్రారంభిస్తున్న యూపీఐ సేవలు చాలామందికి ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని కార్యాలయం (PMO India) ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి అడ్డంకులు లేని డిజిటల్‌ లావాదేవీలకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. తద్వారా డిజిటల్ అనుసంధానం సైతం మెరుగవుతుందని చెప్పింది. ఇకపై భారత్‌ నుంచి శ్రీలంక, మారిషస్‌కు వెళ్లేవారు యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు. మారిషస్‌ నుంచి భారత్‌కు వచ్చేవాళ్లూ ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. త్వరలో మారిషస్‌ బ్యాంకులు రూపే కార్డులనూ జారీ చేయొచ్చు. వాటిని ఆ దేశంతో పాటు భారత్‌లోనూ ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌ను సందర్శించే పర్యాటకులు యూపీఐ (UPI) ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్‌ ఫిబ్రవరి 2న ప్రారంభించింది. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఫ్రాన్స్‌ మంత్రి ప్రిస్కా డెవెనో హాజరయ్యారు. యూపీఐని ప్రపంచమంతటా వ్యాపింపజేయాలన్న మోదీ స్వప్నం సాకారమవుతోందని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఫ్రాన్స్‌తో పాటు ఐరోపాలోని మరిన్ని దేశాల్లోనూ పర్యాటక, రిటైల్‌ రంగాలకు ఈ చెల్లింపుల విధానాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని