Indigo: ఇండిగో ప్యాకేజీ ఫుడ్‌లో అధిక ఉప్పు.. ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియోపై సంస్థ క్లారిటీ

ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్‌లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది.

Published : 19 Apr 2024 00:14 IST

Indigo| దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) అందించే ప్యాకేజీ ఫుడ్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. విమానంలో అందించే ఆహారంలో మోతాదుకు మించి అధికంగా ఉప్పు ఉంటోందంటూ వీడియోలో పేర్కొన్నాడు. దీనిపై ఇండిగో సంస్థ స్పందించి ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫుడ్‌ ఫార్మర్‌ పేరిట వీడియోలు చేసే రేవంత్‌ హిమత్సింకా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. మనం సాధారణంగా వినియోగించే వాటన్నింటిలో కంటే మ్యాగీలో అధికంగా సోడియం ఉంటుందని, ఇండిగో అందించే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో అంతకుమించిన మోతాదు ఉందని పేర్కొన్నాడు. మ్యాగీ కంటే మ్యాజిక్‌ ఉప్మాలో 50 శాతం, పోహాలో 83 శాతం, దాల్‌ చావల్‌ ఇంచుమించుగా అదే స్థాయిలో సోడియం కలిగిఉందని తెలిపాడు. ఇప్పటికే భారతీయులు అధికంగా సోడియంను వినియోగిస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటూ వీడియోలో పేర్కొన్నాడు. 

ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఇండిగో సంస్థ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత స్థాయిలోనే ఉప్పు ఉంటుందని పేర్కొంది. ప్రసిద్ధి చెందిన విక్రేతల నుంచే ప్రీ ప్యాకేజ్డ్‌ లేదా ఫ్రెష్‌ ఫుడ్‌ను ఇండిగో సేకరిస్తుందని తెలిపింది. విమానాల్లో అందించే ఆహారానికి సంబంధించి ప్రతీ ప్యాకేజీపైనా అందులో వాడిన పదార్థాలు, వాటికి సంబంధించిన పోషక విలువల సమాచారం ఉంటుందని తెలిపింది. అవి కూడా FSSAI నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి ఉంటాయని పేర్కొంది. తమను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈతరహా అభిప్రాయాలను గౌరవిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. విమానాలు అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల ఆహారం రుచించదని, అందుకే అన్ని విమానయాన సంస్థలు అధికంగా ఉప్పును వినియోగిస్తుంటాయని ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని