Budget2023: మేడం.. పన్నులను సరళీకరించండి..!

భారత్‌లో పన్నులను సరళీకరించాలని యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక కోరింది. అంతేకాదు కొన్ని రకాల దిగుమతి సుంకాల విషయంలో గందరగోళాన్ని కూడా తొలగించాలని పేర్కొంది. 

Updated : 28 Jan 2023 21:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ భారత్‌లో పన్నులను క్రమబద్ధీకరించడంతోపాటు.. సరళీకరించేలా సంస్కరణలను ప్రవేశపెట్టాలని యూఎస్‌-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వార్షిక బడ్జెట్‌కు తమ ఆకాంక్షలను కేంద్రానికి వెల్లడించింది. విదేశీ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును కమబద్ధీకరించాలని పేర్కొంది.  బ్యాంకులతో సహా విదేశీ కంపెనీల పన్నును దేశీయ కంపెనీలతో సమానం చేయాలని.. తయారీ రంగంలోని కంపెనీలపై పన్నులు హేతు బద్ధీకరించాలని అభ్యర్థించింది.

మూలధన లాభాలపై పన్ను సంస్కరణలను మరింత సరళీకరించాలని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ కోరింది. గ్లోబల్‌ ట్యాక్స్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది. సెక్యూరిటీల్లో పెట్టే ఎఫ్‌పీఐలపై పన్ను రాయితీని విస్తరించాలని అడిగింది. పరిశోధనలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులపై పన్ను మినహాయింపుల కోసం అభ్యర్థించింది.  చమురు-గ్యాస్‌ కంపెనీలకు ఇచ్చే  మినహాయింపులు, ఎక్స్‌రే యంత్రాలపై కస్టమ్స్‌ డ్యూటీ 10శాతం నుంచి 7.5శాతానికి తగ్గింపు, పరిశోధనలకు వాడే కొన్ని రకాల పరికరాల దిగుమతులపై  కస్టమ్స్‌ డ్యూటీలో గందరగోళాన్ని తొలగించాలని పేర్కొంది. యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ ఆఘి ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ భారత్‌ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకొందని తెలిపారు. వచ్చే  బడ్జెట్‌లో మూలధన వ్యయాలపై సూక్ష్మస్థాయిలో  దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని