Apple: యాపిల్‌పై అమెరికా ప్రభుత్వ దావా.. రూ.9.4 లక్షల కోట్లు ఆవిరి!

US sues Apple: యాపిల్‌ గుత్తాధిపత్యం సాధిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో కంపెనీ షేరు విలువ పతనమైంది.

Published : 22 Mar 2024 11:33 IST

US sues Apple | వాషింగ్టన్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌పై (Apple) అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్‌ఫోన్‌ విపణిలో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. ఫలితంగా కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి.

ఇవీ ఆరోపణలు..

యాపిల్‌ (Apple) తన ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని దావాలో ప్రభుత్వం ఆరోపించింది. తద్వారా ధరలను కృత్రిమంగా పెంచుతోందని పేర్కొంది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతోందని తెలిపింది. న్యూజెర్సీ ఫెడరల్‌ కోర్టులో అగ్రరాజ్య జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేశాయి. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్‌, మెటా, అమెజాన్‌ సరసన తాజాగా యాపిల్‌ కూడా చేరింది. యూరప్‌లోనూ ఈ ఐఫోన్‌ తయారీ కంపెనీపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

షేర్లు ఢమాల్‌..

ఈ పరిణామాల నేపథ్యంలో యాపిల్ షేర్లు పతనమయ్యాయి. దాదాపు 4.1 శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజులోనే 113 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9.41 లక్షల కోట్లు) ఆవిరైంది. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 11 శాతం వరకు కుంగడం గమనార్హం. మూడు ట్రిలియన్‌ డాలర్ల సంపదతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ నిలిచిన విషయం తెలిసిందే.

యాపిల్‌ స్పందనిదే..

ప్రభుత్వ దావాను యాపిల్‌ (Apple) కొట్టిపారేసింది. అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతోందని ఆరోపించింది. ప్రజల కోసం రూపొందిస్తున్న సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని పేర్కొంది. ఇలాంటి దావాలు యాపిల్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు తలపెడతాయని అభిప్రాయపడింది. వీటిని సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని