Voda Idea: రూ.45వేల కోట్ల సమీకరణకు వొడాఫోన్‌ నిర్ణయం

వొడాఫోన్‌ ఐడియా రూ.45వేల కోట్లు నిధులు సమీకరించనుంది. తద్వారా 4జీ, 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ చేపట్టనుంది.

Published : 27 Feb 2024 23:30 IST

దిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా (Voda Idea) టెలికాం కంపెనీ బోర్డు నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధానాల ద్వారా రూ.20వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో ప్రమోటర్లు సైతం పాల్గొంటారు. ఈక్విటీ, డెట్‌ కలిపి మొత్తం రూ.45 వేల కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఓ వైపు ఎయిర్‌టెల్‌, జియో దూసుకుపోతుండగా.. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా మాత్రం నిలదొక్కుకునేందుకు ఇబ్బందిపడుతోంది. మొత్తంగా రూ.2.1 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. యూజర్లను సైతం కోల్పోతోంది. ఈ క్రమంలో బోర్డు నిధుల సమీకరణ నిర్ణయానికొచ్చింది. ఇదే విషయంలో ఏప్రిల్‌ 2న వాటాదారుల సమావేశం నిర్వహించనుంది. వారి అనుమతి మేరకు రాబోయే త్రైమాసికాల్లో నిధుల సమీకరణ చేపట్టనుంది.

తద్వారా వచ్చే నిధులతో 4జీ కవరేజీ విస్తరణ, 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడం, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటివి చేపట్టనున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. వొడాఫోన్‌ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. బకాయిలను ఈక్విటీగా మార్చుకోవడంతో ఈ మొత్తం దఖలు పడింది. ఇక బ్రిటీష్‌ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ గ్రూప్‌నకు 32 శాతం వాటా ఉండగా... ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని