Stock Market: లోయర్‌ సర్క్యూట్‌కు వొడాఫోన్‌ ఐడియా, పేటీఎం షేర్లు

Stock Market: వొడాఫోన్‌ ఐడియా షేర్లు 10 శాతం, పేటీఎం షేర్లు ఐదు శాతం మేర నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Published : 28 Feb 2024 12:41 IST

దిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్లు (Vodafone Idea shares) బుధవారం 10 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో రూ.14.29 దగ్గర లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. రూ.45,000 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. అయినప్పటికీ.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగవ్వకపోవడం గమనార్హం.

ప్రతిపాదిత నిధుల సమీకరణలో రూ.20,000 కోట్లు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పద్ధతుల్లో సమకూర్చుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రమోటర్లు కూడా పాల్గొనున్నారు. మొత్తంగా ఈక్విటీ, డెట్‌ ద్వారా దాదాపు రూ.45,000 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు బ్యాంకర్లు, కౌన్సిల్‌ను నియమించేందుకు కంపెనీకి బోర్డు అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియాకు రూ.2.1 లక్షల కోట్ల రుణభారం ఉంది. చందాదారుల సంఖ్య భారీగా తగ్గడంతో నష్టాలను చవిచూస్తోంది. ప్రస్తుతం కంపెనీ బ్యాంక్‌ రుణాలు రూ.4,500 కోట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. నిధుల సమీకరణ వల్ల కంపెనీ 4జీ కవరేజీ పెంచడం, 5జీ నెట్‌వర్క్‌ సేవల ప్రారంభం, సామర్థ్యాల విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుందని కంపెనీ వెల్లడించింది.

పేటీఎం సైతం..

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పేటీఎం షేర్లు (Paytm shares) సైతం బుధవారం ఐదు శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో రూ.406.15 దగ్గర లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి. గతవారం రోజుల్లో ఈ స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకడం ఇది మూడోసారి

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) పార్ట్‌టైం నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ హోదా నుంచి విజయ్‌ శేఖర్‌ శర్మ వైదొలిగిన విషయం తెలిసిందే. బ్యాంక్‌ బోర్డు పునర్నిర్మాణం పూర్తయిందని, కొత్త ఛైర్మన్‌ ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామనీ సోమవారం ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పీపీబీఎల్‌ పేర్కొంది.

పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లలో తాజా డిపాజిట్లను ఫిబ్రవరి 29 తరవాత అంగీకరించొద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత గడువును మార్చి 15కు పొడిగించింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పేటీఎం షేర్ల పతనం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని