Vodafone Idea: ‘మస్క్‌’తో చర్చలపై వొడాఫోన్‌ ఐడియా క్లారిటీ.. షేర్లు డౌన్‌!

Vodafone Idea: కంపెనీలో కొంత వాటాను స్టార్‌లింక్‌కు విక్రయించే యోచనలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై వొడాఫోన్‌ ఐడియా స్పష్టతనిచ్చింది. 

Published : 02 Jan 2024 15:40 IST

దిల్లీ: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (Vodafone Idea - VI) షేర్లు గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో అనూహ్యంగా పుంజుకున్నాయి. కంపెనీలో కొంత వాటాను బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు (Elon Musk) చెందిన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల సంస్థ స్టార్‌లింక్‌కు (StarLink) విక్రయించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్టార్‌లింక్‌తో వీఐ చర్చలు జరుపుతున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 33 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే వీఐ షేర్లు ఎగబాకాయి. అయితే, తాజాగా ఈ అంశంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

స్టార్‌లింక్‌తో (StarLink) తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. అసలు ఈ వార్తలకు ఆధారమేంటో తమకు తెలియదని పేర్కొంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టతనిచ్చింది. షేరు విలువను ప్రభావితం చేసే ఎలాంటి సమాచారాన్నైనా రెగ్యులేటరీలకు వెంటనే తెలియజేస్తామని పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కంపెనీ షేరు విలువ కిందకు దిగొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2:04 గంటల సమయంలో షేరు ధర 5.59 శాతం కుంగి రూ.16.05 దగ్గర ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని