Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్‌ గ్లోబల్‌ వాటాలు వాల్‌మార్ట్‌ చేతికి..!

ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి వాల్‌మార్ట్‌ భారీగా వాటాలను కొనుగోలు చేసింది. ఈ సారి టైగర్‌ గ్లోబల్‌ నుంచి వీటిని దక్కించుకొంది. ఈ డీల్‌ విలువ రూ.11 వేల కోట్ల పైమాటే.

Published : 31 Jul 2023 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో కీలక వాటాలు అమెరికా సంస్థ వాల్‌మార్ట్‌ (Walmart) చేతికి వెళ్లాయి. ఈ మేరకు హెడ్జ్‌ఫండ్‌ సంస్థ టైగర్‌ గ్లోబల్స్‌(Tiger Global) ఇన్వెస్ట్‌మెంట్-వాల్‌మార్ట్‌ మధ్య డీల్‌ జరిగిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెలువరించింది. ఈ డీల్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లు (రూ.11.5 వేల కోట్లు)గా తెలుస్తోంది. టైగర్‌ గ్లోబల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మదుపర్లకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డీల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ విలువను 35 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. 2021లో వాల్‌మార్ట్‌, ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను సాఫ్ట్‌బ్యాంక్‌కు  విక్రయించే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ విలువను 38 బిలియన్‌ డాలర్లుగా లెక్కించిన విషయం తెలసిందే.

2030కి తలసరి ఆదాయం రూ.3.28 లక్షలు!

2007లో సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌ను ఆరంభించారు. 2009లో టైగర్‌ గ్లోబల్‌ తొలి సారి ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి గతంలో టైగర్‌ గ్లోబల్‌లో ఎండీగా పనిచేశారు. 2010-2015 మధ్యలో టైగర్‌ గ్లోబల్‌ 1.2 బిలియన్‌ డాలర్లను ఈ ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజంలో పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టబడిపై 3.5 బిలియన్ల లాభం సాధించినట్లు ఇన్వెస్టర్స్‌కు రాసిన లేఖలో వెల్లడించింది.

2018లో వాల్‌మార్ట్‌ 16 బిలియన్‌ డాలర్లు వెచ్చించి ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా దక్కించుకొంది. మరో నాలుగేళ్లలో కంపెనీని ఐపీవోకు తీసుకెళతానని పేర్కొంది. ఇటీవల వాల్‌మార్ట్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కంపెనీ సీఎఫ్‌లో జాన్‌ డేవిడ్‌ రెయినీ మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్‌కు 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరే సత్తాఉందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మర్చంటైజ్‌ వాల్యూమ్‌లను 200 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో వాల్‌మార్ట్‌ అడుగులు వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని