Pakistan: 2030 నాటికి జీ20లో చేరడమే లక్ష్యం.. పాక్‌ కొత్త ప్రధాని షెహబాజ్‌

Pakistan: పాక్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందని కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. దీన్ని గాడిన పెట్టడమే తన లక్ష్యమన్నారు. 2030 నాటికి దేశాన్ని జీ20 కూటమిలో చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

Published : 04 Mar 2024 01:09 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను (Pakistan Economy) పూర్తిగా గాడిన పెడతామని కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. ఆ మేరకు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామన్నారు. 2030 నాటికి జీ20 కూటమిలో చేరడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)ల తరఫున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (PTI) మద్దతు ఉన్న అభ్యర్థి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పాకిస్థాన్‌ (Pakistan) ముందు పెద్ద సవాల్‌తో పాటు అవకాశమూ ఉందని ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ప్రసంగిస్తూ షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. అయితే, కలిసికట్టుగా పోరాడితే సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. అది కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం తీవ్ర రుణ సంక్షోభంలో ఉందని తెలిపారు. జాతీయ అసెంబ్లీ నిర్వహణ ఖర్చులను సైతం రుణాల ద్వారా సమీకరించుకున్న నిధులతోనే భరిస్తున్నామని వెల్లడించారు.

కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను రద్దు చేస్తామంటూ షెహబాజ్‌ షరీఫ్‌ తన ప్రణాళికలను వివరించారు. సమగ్ర ఎగుమతి జోన్ల స్థాపనకు ప్రావిన్షియల్‌ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. పాక్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉందని తెలిపారు. దాదాపు రూ.లక్ష కోట్ల (పాకిస్థాన్‌ రూపాయల్లో) బడ్జెట్‌ లోటు ఉన్న సమయంలో తాను అధికారం చేపడుతున్నానని వెల్లడించారు. సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నామన్నారు. రూ.వేల కోట్లు వడ్డీ రూపంలోనే కట్టాల్సి ఉందన్నారు. విద్యుదుత్పత్తి కంపెనీలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాలని తెలిపారు. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్ వంటి ప్రభుత్వ సంస్థలు రూ.వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు.

ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కిస్తానని షెహబాజ్‌ షరీఫ్‌ హామీ ఇచ్చారు. ఇది అంత సులభమైన పని కానప్పటికీ.. చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏటా దాదాపు రూ.500-600 కోట్ల విద్యుత్తు చోరీ జరుగుతోందని తెలిపారు. పన్ను ఎగవేత పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ లోపాలను సవరిస్తామని చెప్పారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తామన్నారు. రాయితీలు కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు సోలార్‌ ట్యూబ్‌వెల్‌ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. నకిలీ విత్తనాల మాఫియాను రూపుమాపుతామన్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని