జుకర్‌బర్గ్‌, మస్క్‌ పనితీరు ఎలా ఉంటుందంటే.. వారితో పనిచేసిన అనుభవాలను పంచుకున్న భారత టెకీ

CEOs: గొప్ప సీఈఓలంతా చాలా చిన్న చిన్న విషయాలపైనే దృష్టి పెడతారని వారితో కలిసి పనిచేసిన ప్రముఖ టెక్‌ నిపుణుడు శ్రీరామ్‌ కృష్ణన్‌ తెలిపారు.

Updated : 16 Feb 2024 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో గొప్ప సీఈఓల్లో కొన్ని సాధారణ లక్షణాలుంటాయని సిలికాన్‌ వ్యాలీకి చెందిన ప్రముఖ టెక్‌ నిపుణుడు శ్రీరామ్‌ కృష్ణన్‌ (Indian Techie Sri Ram Krishnan) తెలిపారు. భారత సంతతికి చెందిన ఈయన మార్క్‌ జుకర్‌బర్గ్‌, సత్య నాదెళ్ల, ఎలాన్‌ మస్క్‌(Elon Musk) వంటివారితో కలిసి పనిచేశారు. వారితో ఉన్న అనుభవాలను ఆయన తాజాగా యూఏఈలో జరుగుతున్న వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

‘‘టీనేజర్‌గా ఉన్నప్పుడే కోడింగ్‌ రాయడం నేర్చుకున్నా. అదే టెక్‌ రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదం చేసింది. 2007లో మైక్రోసాఫ్ట్‌లో చేరా. సియాటెల్‌లో కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశా. అప్పటికీ ఆయన సీఈఓ కాలేదు. తర్వాత ఫేస్‌బుక్‌లో చేరి జుకర్‌బర్గ్‌తో పనిచేశాను. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఎలాన్‌ మస్క్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ‘ఎక్స్‌’ (అప్పట్లో ట్విటర్‌) కొనుగోలు సమయంలో ఆయనతోనే ఉన్నాను. ప్రస్తుతం ఆండ్రెసెన్‌ హోరోవిట్జ్‌లో జనరల్‌ పార్ట్‌నర్‌గా ఉన్నాను’’ అని టైమ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరామ్‌కృష్ణన్‌ వెల్లడించారు.

విజయవంతమైన అందరి సీఈఓల్లో కొన్ని సాధారణ లక్షణాలున్నాయని శ్రీరామ్‌కృష్ణన్‌ తెలిపారు. ‘‘జుకర్‌బర్గ్‌, మస్క్‌ వంటి సీఈఓలు కంపెనీలో చిన్నచిన్న విషయాలను సైతం వారే స్వయంగా చూసుకుంటారు. పర్యవేక్షణ బాధ్యతలను ఇతరులకు అప్పగించరు. నేను చూసిన గొప్ప సీఈఓలంతా మైక్రో మేనేజర్లు. జుకర్‌బర్గ్‌ ప్రతి అంశంపై శ్రద్ధ పెడతారు. ఒక ప్రాజెక్టుపై దానిమీద పనిచేస్తున్న యువ ఇంజినీర్‌ కంటే ఎక్కువ విషయాలు ఆయనకు తెలుసుంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు నా జీవిత భాగస్వామి మెటాలోనే పని చేశారు. జుకర్‌బర్గ్‌ ఇప్పటికీ అలాగే ఉన్నారని ఆమె ఓ సందర్భంలో చెప్పారు’’ అని కృష్ణన్‌ గుర్తు చేసుకున్నారు.

అందరూ అనుకునేట్లుగా ఎలాన్ మస్క్‌ (Elon Musk) ఎక్కువ సమయాన్ని ‘ఎక్స్‌’లో పోస్ట్‌లు చేయడంపై వెచ్చించరని కృష్ణన్‌ తెలిపారు. ‘ఎక్స్‌’ను కొనుగోలు చేసిన సమయంలో 95 శాతం సమావేశాలు ఆయన జూనియర్‌ ఇంజినీర్లతోనే నిర్వహించారని చెప్పారు. అలాగే ఆయన ప్రతి విషయాన్ని చాలా లోతుగా చర్చించి ప్రణాళికలు వేస్తారని తెలిపారు.

భారత్‌ నుంచి అమెరికాకు మారిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిందో కృష్ణన్‌ ఈసందర్భంగా వివరించారు. భారత్‌లో చాలా సంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య పెరిగానని తెలిపారు. తొలిసారి సిలికాన్‌ వ్యాలీకి వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి చాలా భిన్నంగా అనిపించినట్లు చెప్పారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయన అన్నా యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. అప్పటికీ ఆయన తండ్రి ఓ బీమా రంగంలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణిగా ఉండేవారు. 2005లో మైక్రోసాఫ్ట్‌లో ఆయన టెక్‌ కెరీర్ ప్రారంభమైంది. అక్కడ ఆయన విండోస్‌ అజూర్‌ విభాగానికి ఎక్కువగా పనిచేశారు. ‘ఎక్స్‌’లో టైమ్‌లైన్‌, కొత్త యూఐ ప్లాట్‌ఫామ్‌, సెర్చ్‌ వంటి ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఫేస్‌బుక్‌, స్నాప్‌లో మొబైల్‌ యాడ్‌ ప్రోడక్ట్‌లనూ అభివృద్ధి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని