Jack Ma: ఇప్పుడు జాక్‌ మా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?

చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసి ఆ దేశ పాలకుల ఆగ్రహానికి గురైన ప్రముఖ వ్యాపారవేత్త జాక్‌ మా గత కొంత కాలంగా బయట పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడుంటున్నారు.. ఏం చేస్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated : 30 Nov 2022 15:26 IST

టోక్యో: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) ఒకప్పుడు సమావేశాలు, పర్యటనలు, ప్రసంగాలతో తీరికలేకుండా గడిపేవారు. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచేవారు. కానీ, గత కొంతకాలంగా పూర్తిగా కనుమరుగైపోయారు. ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా బయటకు రావడం లేదు. టెక్‌ వ్యాపారాలు, వాటి యజమానులపై చైనా విరుచుకుపడడం ప్రారంభించినప్పటి నుంచి జాక్‌ మా (Jack Ma) జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నారనేది చాలా మందికి ఓ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. దీని గురించే విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (FT) ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

జాక్‌ మా ఆయన కుటుంబంతో కలిసి గత ఆరు నెలలుగా జపాన్‌ రాజధాని టోక్యోలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన వ్యవహారాలను చక్కబెడుతున్న ఇద్దరు కీలక వ్యక్తులు తెలిపినట్లు ఎఫ్‌టీ పేర్కొంది. ఆయన తరచూ అమెరికా, ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారట. వ్యక్తిగత వంట మనిషి, భద్రతా సిబ్బంది మాత్రమే ఆయన వెంట ఉంటున్నారని సమాచారం. టోక్యోలో అసలు ఎలాంటి హడావుడి లేకుండా చాలా సాధారణ జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది. వీలైనంత వరకు ప్రజాకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. టోక్యో నడిబొడ్డున ఉన్న గింజా డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ప్రైవేటు వ్యక్తుల క్లబ్బులు, ఇంపీరియల్‌ ప్యాలెస్‌కు ఎదురుగా ఉన్న మరునౌచీ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న మరో క్లబ్‌.. ఇక్కడే ఆయన ఎక్కువగా సేదతీరుతున్నారని సమాచారం.

జాక్‌ మా ఆధునిక కళారూపాలపై కూడా ఆసక్తి పెంచుకున్నట్లు సమాచారం. వాటిని విరివిగా సేకరిస్తున్నారట. కాలక్షేపం కోసం స్వయంగా వాటర్‌కలర్స్‌తో పెయింటింగ్స్‌ కూడా వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు యాంట్‌ గ్రూప్‌, అలీబాబాయే కాకుండా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర రంగాలకూ విస్తరించే యోచనలో ఉన్నారట. దానికి సంబంధించిన ప్రణాళికలను ఆయన జపాన్‌లోనే రూపొందించినట్లు ఎఫ్‌టీ కథనం పేర్కొంది. ముఖ్యంగా సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే రంగాల్లోకి విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అలాగే రెండు ప్రధాన కంపెనీల్లోని బాధ్యతల్ని చాలా వరకు కొత్త తరానికి అప్పగించినట్లు కూడా తెలుస్తోంది. చివరకు దాతృత్వ సంస్థ ‘జాక్‌ మా ఫౌండేషన్‌’ కార్యకలాపాలు సైతం తగ్గించేసినట్లు సమాచారం. కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మాస్క్‌లు పంపిణీ చేసి ఈ సంస్థ వార్తల్లో నిలిచింది.

వ్యాపారాలపై చైనా విధిస్తున్న నియంత్రణలపై జాక్‌ మా బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయనకు కష్టకాలం మొదలైన విషయం తెలిసిందే. జిన్‌పింగ్‌ నేతృత్వంలోని సర్కార్‌ ఆయన సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. యాంట్‌ గ్రూప్‌ ఐపీఓని అడ్డుకుంది. ఆ తర్వాత నుంచే చైనాలో ప్రైవేట్‌ టెక్ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం విరుచుకుపడడం ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని