Wholesale inflation: ఫిబ్రవరిలో మరింత దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం

Wholesale inflation: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (Wholesale inflation) 2023 ఫిబ్రవరిలో 3.85 శాతంగా నమోదైంది.

Published : 14 Mar 2023 15:24 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (Wholesale inflation) వరుసగా తొమ్మిదో నెలా దిగొచ్చింది. 2023 ఫిబ్రవరిలో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (WPI) 3.85 శాతంగా నమోదైంది. తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్తు ధరలు తగ్గుముఖం పట్టడం అందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ సూచీ 13.73 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో అది 4.73 శాతంగా నమోదైంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మాత్రం జనవరితో పోలిస్తే 2.38 శాతం నుంచి 3.81 శాతానికి పెరిగింది. ముడి చమురు, సహజ వాయువు, ఆహారేతర వస్తువులు, ఆహార ఉత్పత్తులు, ఖనిజాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు-రసాయన ఉత్పత్తులు, ఎలక్ట్రికల్‌ పరికరాలు, మోటార్‌ వాహనాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది.

పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 2.59 శాతం, కూరగాయలు (-)21.53 శాతం, నూనె గింజలు (-)7.38 శాతం, విద్యుత్తు- ఇంధన బాస్కెట్‌లో 14.82 శాతం, తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 1.94 శాతంగా నమోదైంది. మరోవైపు ఆహార పదార్థాలు, ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడంతో గత నెలలో రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు సోమవారం వెల్లడించాయి. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరిలో 6.52 శాతం కాగా, ఫిబ్రవరిలో కాస్త తగ్గినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని