Fixed Deposit: భారతీయులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎందుకింత మక్కువ?

Fixed Deposit: భారత్‌లో అత్యధిక మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గుచూపడానికి వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది. 

Published : 07 Feb 2023 12:27 IST

దిల్లీ: భారత్‌లో అనేక మదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్లు, బీమా పథకాలు, బాండ్లు, పోస్టాఫీస్‌ పొదుపు పథకాలు ఇలా చాలా మార్గాల్లో డబ్బును మదుపు చేయొచ్చు. కానీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit- FD)కు ఉన్న ఆదరణ మాత్రం అంతాఇంతా కాదు. ఇప్పటికీ అత్యధిక మంది భారతీయులు దీన్నే తమ మదుపు మార్గంగా ఎంచుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది.

ఇందుకే ఎఫ్‌డీల్లో...

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) ఆదరణపై కువేరా అనే ‘ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌’ సంస్థ సర్వే నిర్వహించింది. దాదాపు 16 లక్షల మంది మదుపర్ల నుంచి ఇది అభిప్రాయాలను సేకరించింది. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులు సహా ఇతర ఆర్థిక అనిశ్చితుల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposit)కు ఎలాంటి ముప్పు ఉండదని చాలా మంది తెలిపారు. దాదాపు 44 శాతం మంది ఈ కారణంగానే ఎఫ్‌డీ (Fixed Deposit)ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు కావాల్సినప్పుడు సురక్షితంగా డబ్బును వాపస్‌ తీసుకోవడానికి ఎఫ్‌డీ కంటే మేలైన మార్గం లేదని మరికొంత మంది తెలిపారు. మరో 23 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కోసం తమ అత్యవసర నిధిని ఎఫ్‌డీల్లో పెడుతున్నట్లు వెల్లడించారు.

2017లోనూ ఎఫ్‌డీదే హవా..

2017లో సెబీ నిర్వహించిన సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పటికీ.. ఇప్పటికీ భారతీయ మదుపర్ల ఆలోచనల్లో పెద్దగా తేడా లేకపోవడం గమనించాల్సిన విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో సెబీ నిర్వహించిన సర్వేలో దాదాపు 95 శాతం మంది తమ డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposit)లో ఉంచడానికే మొగ్గుచూపారు. కేవలం 10 శాతం మంది మాత్రమే మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌లను ఎంచుకున్నారు.

‘ఇది సరైన సమయం..’

‘‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పెంచుతోంది. ఎఫ్‌డీ (Fixed Deposit)ల్లో మదుపు చేయడానికి ఇది సరైన సమయం. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఎఫ్‌డీ (Fixed Deposit)లు సురక్షితమైనవే కాకుండా స్థిరమైన రాబడినిస్తాయి. ఈ కారణంగానే చాలా మంది భారతీయులు ఎఫ్‌డీలవైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా పెద్దగా నష్టభయాన్ని భరించలేని వారికి ఇది మంచి మార్గం’’ అని కువేరా సహ వ్యవస్థాపకుడు గౌరవ్‌ రస్తోగీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు