Elon musk: పరాగ్‌ను మస్క్‌ అందుకే తొలగించారా? ఇద్దరి మధ్య భేటీలో ఏం జరిగింది?

ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈఓగా ఉన్న పరాగ్‌ అగర్వా్‌ల్‌ను తొలగించారు. దీని వెనుక కారణమేంటన్నది తాజాగా బయటకొచ్చింది.

Updated : 04 Sep 2023 16:11 IST

\

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొనుగోలు అంశం ఇప్పుడంటే ముగిసిన అధ్యాయం. ట్విటర్‌ను ఎక్స్‌గా మార్చడం.. అందులో చేపడుతున్న ఎలాన్‌ మస్క్‌ (Elon musk) చేపడుతున్న మార్పులు గురించే ఇప్పుడు చర్చంతా. కానీ ముగిసిన అధ్యాయానికి సంబంధించి కొన్ని ఆసక్తి విషయాలు తాజాగా బయటకొచ్చాయి. ట్విటర్‌ను కొనుగోలు చేసిన వెంటనే అప్పట్లో ఆ సంస్థకు సీఈఓగా ఉన్న భారత సంతతి వ్యక్తి పరాగ్‌ అగర్వాల్‌కు (Parag Agrawal) ఎలాన్‌ మస్క్‌ ఉద్వాసన పలికారు. ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది తాజాగా బయటకొచ్చింది.

గతేడాది అక్టోబర్‌లో ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. సంస్థ తన అధీనంలోకి రాగానే పరాగ్‌ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించారు. తనే ట్విటర్‌ సీఈఓగా ప్రకటించుకున్నారు. టాప్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లను, వేలాది ఉద్యోగులనూ ఎలాన్‌ మస్క్‌ తొలగించారు. అయితే, పరాగ్‌ను మస్క్‌ తొలగించడం వెనుక బలమైన కారణం ఉందట. ఎలాన్‌ మస్క్‌పై ఓ పుస్తకం రాసిన వాల్టర్‌ ఐజాక్సన్‌ అనే రచయిత ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. సెప్టెంబర్‌ 12న రాబోతున్న పుస్తకం గురించి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో పుస్తక సారాంశం రాస్తూ దీని గురించీ ప్రస్తావించారు.

సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ కడుతున్నారా?.. నెలాఖరులో ఇది పూర్తి చేయండి!

అది 2022 మార్చి. అప్పటికి ట్విటర్‌ కొనుగోలు గురించి తన ఆలోచనను ఎలాన్‌ బయటపెట్టని రోజులవి. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య భేటీ జరిగింది. రాత్రి డిన్నర్‌ సమయంలో వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీ అనంతరం ఇద్దరూ పరస్పరం డిన్నర్‌ గురించి ట్వీట్లు కూడా చేసుకున్నారు. వాస్తవానికి ఈ భేటీ అనంతరం పరాగ్‌ గురించి మస్క్‌ మాట్లాడుతూ...‘పరాగ్‌ చాలా మంచి వ్యక్తి’ అని కొనియాడట కూడా. అదే సమయంలో తన అసహనాన్నీ వ్యక్తపరిచారట. ‘‘కంపెనీ నిర్వాహకులకు నచ్చినట్లు ఉంటే మాత్రం సరిపోదు. ట్విటర్‌ను ముందుకు నడిపించాలంటే దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పరాగ్‌ ఆ తరహా వ్యక్తికాదు’’ అని అన్నట్లు ఐజాక్సన్‌ పేర్కొన్నారు.

ఆ భేటీ జరిగిన కొద్ది రోజులకే ట్విటర్‌ గురించి మస్క్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ‘ట్విటర్‌ చచ్చపోతోందా?’ అంటూ మస్క్‌ తన అసంతృప్తిని వ్యక్తంచేశాడు. దానిపై అగర్వాల్‌ స్పందిస్తూ.. ట్విటర్‌ను ఎలా మెరుగుపరచాలో తనకు సుద్దులు చెప్పొద్దు అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు. దీంతో వారి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్‌ ముందుకు రావడం.. తర్వాత వెనుకడుగు వేయడం.. మళ్లీ కొనుగోలు చేయడం.. వస్తూ వస్తూనే పరాగ్‌ను తొలగించడం తర్వాతి కథ!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని