సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ కడుతున్నారా?.. నెలాఖరులో ఇది పూర్తి చేయండి!

Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాల చందారులా..? అకౌంట్ ఓపెన్‌ చేసే సమయంలో ఆధార్‌ వివరాలు నమోదు చేయలేదా..? అలా అయితే ఈ గడువు ముగిసేలోగా బ్యాంకు, పోస్టాఫీసులో ఆధార్‌ వివరాలు ఇవ్వకపోతే మీ ఖాతాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది.

Updated : 02 Sep 2023 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY)తో పాటు పోస్టాఫీసు డిపాజిట్‌ పథకాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు (small savings schemes) కడుతున్నవారికి అలర్ట్‌! ఆయా పథకాల్లో చేరిన వారు ఆధార్‌ సమర్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. గడువు ముగిసేలోగా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఆధార్‌ వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 31న ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

PPF, SSY, NSC, SCSS సహా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలను కొందరు ఆధార్‌ కార్డు వివరాలు సమార్పించకుండానే ఖాతాలు తెరిచారు. అయితే వీరు సెప్టెంబర్‌ నెలాఖరులోగా (2023 సెప్టెంబరు 30) ఆ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణంతోనైనా సమర్పించకపోతే 2023 అక్టోబరు 1 నుంచి ఖాతాలు స్తంభించిపోతాయి. అదే కొత్తగా అకౌంట్‌ ఓపెన్‌ చేసేవారు ఖాతా తెరిచిన ఆరు నెలల్లోగా ఆధార్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఖాతాలు కూడా పనిచేయవు.

అలాగే, కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఇండియా పోస్ట్‌ మే నెలలో తమ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. ఖాతాలో ఉన్న డిపాజిట్‌ మొత్తం రూ.50 వేలు దాటినా, ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల మొత్తం విలువ రూ.1 లక్ష మించినా, ఒక నెలలో బదిలీ లేదా ఉపసంహరణ మొత్తం రూ.10 వేలు దాటినా.. ఈ మూడు సందర్భాల్లో రెండు నెలల్లోగా పాన్‌ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

డబ్బున్నవాళ్లు నా కుమార్తె దృష్టిలో చెడ్డవాళ్లే: జీవిత చరిత్రలో ఎలాన్‌ మస్క్‌!

చిన్న మొత్తాల పొదుపు పథకాలు అంటే..?

కష్టపడి పనిచేసి సంపాదించుకున్న సొమ్మును పొదుపు చేసుకోవాలనుకునేవారి కోసం ప్రభుత్వం అనుమతించిన పెట్టుబడి మార్గాలే ఈ పొదుపు పథకాలు. ఈ పథకాల్లో పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి రిస్క్‌ ఉండదు. పైగా వీటిలో మదుపు వల్ల పన్ను ప్రయోజనాలూ పొందుతారు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సవరిస్తారు.

జులై- సెప్టెంబరు త్రైమాసికానికి వడ్డీ రేట్లు ఇలా..

  •  సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)- 8.2%
  •  సుకన్య సమృద్ధి యోజన (SSY)- 8.0%
  •  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC)- 7.7%
  •  కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP)- 7.5%
  •  5 ఏళ్ల డిపాజిట్‌ - 7.5%
  •  PO- నెలవారీ పొదుపు పథకం -  7.4%
  •  పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (PPF)- 7.1%
  •  5 ఏళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ - 6.5%
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని