స్టాక్‌ మార్కెట్‌.. ఎఫ్‌అండ్‌ఓపై ఎందుకింత మోజు..?

దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్‌అండ్‌ఓ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌) ట్రేడ్‌లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్‌ అన్నారు.

Updated : 19 May 2024 12:47 IST

నష్టాలు వస్తున్నా తగ్గని చిన్న మదుపరులు
తగిన పరిమితులు నిర్దేశించాలి
ఆర్థిక నిపుణుల సూచన

దిల్లీ: దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్‌అండ్‌ఓ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌) ట్రేడ్‌లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్‌ అన్నారు. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌లను అర్థం చేసుకోవటానికి ఎంతో మార్కెట్‌ పరిజ్ఞానం, అనుభవం కావాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీ‡ఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2024లో ఆయన మాట్లాడారు. ఏ దేశం అయినా ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందటానికి ముందుగా ఆర్థిక సేవల రంగం విస్తరిస్తుంది, అదే ఒక్కోసారి పెద్ద సమస్యలను తెచ్చిపెట్టవచ్చు- అని వివరిస్తూ,   1997-98 నాటికి ‘ఆసియా సంక్షోభాన్ని’ ఉదహరించారు. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌ లావాదేవీల పరిమాణం మనదేశంలో అత్యధికంగా నమోదవుతున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఇది మంచిదా? చెడా? అనేది ప్రశ్నార్థకం- అన్నారాయన. దేశంలో ప్రజల పొదుపు మొత్తాలు, ఉత్పాదక రంగాలకు తరలివెళ్లి స్థిరమైన వృద్ధి సాధనకు వీలు కల్పించాల్సిన బాధ్యత ఆర్థిక సేవల రంగంపై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఎంతో మందికి ఎఫ్‌అండ్‌ఓపై తగినంత అవగాహన ఉందని అనుకోలేం, మరీ చిన్న మదుపరులకు (రిటైల్‌ ఇన్వెస్టర్స్‌) సైతం ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌లు చేసే అవకాశం కల్పించటం అవసరమా? అని ఆలోచించాలి- అన్నారు. గత కొంతకాలంగా దేశంలో ప్రజల పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గత మూడేళ్ల కాలంలో దాదాపు రూ.9 లక్షల కోట్ల మేరకు పొదుపు మొత్తాలు తగ్గిపోయి, 2022- 23 నాటికి  రూ.14.16 లక్షల కోట్లకు పరిమితం కావటం గమనార్హం.  అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయి. 2022-21లో రూ.64,084 కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, 2022-23 నాటికి రూ.179 లక్షల కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఈక్విటీ షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడులు సైతం రూ.1.07 లక్షల కోట్ల నుంచి  రూ.2.06 లక్షల కోట్లకు పెరిగాయి.

గత వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం ఎఫ్‌అండ్‌ఓలో రిటైల్‌ మదుపర్లు ఎక్కువగా ట్రేడ్‌ చేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. అంతకు ముందు సెబీ ఛైర్మన్‌ మాధవి పురి బచ్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం.  

గత ఏడాదిలో సెబీ అధ్యయనం ప్రకారం 45.24 లక్షల మంది చిన్న మదుపర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో లాభాలు ఆర్జించారు. కొవిడ్‌-19 నాటి నుంచి     ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ట్రేడ్‌ చేసే రిటైల్‌ మదుపరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 నాటికి ఈ విభాగంలో ట్రేడ్‌ చేసే రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య దాదాపు 7 లక్షలు కాగా, ఆ తర్వాత ఈ సంఖ్య 35- 40 లక్షలకు పెరగడం గమనార్హం. అందుకే నియంత్రణ సంస్థలు, ఆర్థిక నిపుణులు ఈ విషయంలో తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా ‘హెచ్చరిక’లు చేస్తున్నట్లే అనుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని