Zomato: జొమాటో కీలక ప్రకటన.. వెజ్‌ ఆర్డర్లూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే..!

Zomato: ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని రకాల ఆహార పదార్థాలను అందించే వారికి ఒకేరకమైన యూనిఫామ్‌ ఉంటుందని స్పష్టం చేసింది. డెలివరీ బాయ్స్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌ రంగు దుస్తులు ఉండబోవని తెలిపింది.

Updated : 20 Mar 2024 12:15 IST

దిల్లీ: శాకాహారం మాత్రమే కోరుకునే వారికోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Pure Veg Fleet)ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన కొన్ని గంటల్లోనే జొమాటో (Zomato) మరో కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త సేవలను అందించే తమ డెలివరీ బాయ్స్‌ గ్రీన్‌ రంగు యూనిఫామ్‌ ధరిస్తారని తెలిపిన కంపెనీ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌లోనే కనిపిస్తారని తెలిపింది. అలా అని ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ సేవలను నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. వెజ్‌ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని తెలిపింది. 

మరోవైపు ‘ప్రతికూల సామాజిక పరిణామాలు’ ఎదురైతే ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ వెంటనే నిలిపివేస్తామని సీఈఓ దీపిందర్ గోయల్ మంగళవారం రాత్రి వెల్లడించారు. ఆన్‌లైన్‌లో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సేవల వల్ల కొన్ని వర్గాలు రెగ్యులర్‌ జొమాటోను కూడా బహిష్కరించొచ్చనే ఆందోళనలకు గోయల్‌ చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల మధ్య తాజాగా యూనిఫామ్‌ను మాత్రమే మార్చుతున్నట్లు ప్రకటన రావడం గమనార్హం.

ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ (Pure Veg Fleet) వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్‌ (Zomato CEO Deepinder Goyal) స్పష్టం చేశారు. ‘‘ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. డెలివరీ బాక్సుల్లో ఆహార పదార్థాలు ఒలికిపోతుంటాయి. దీని వల్ల ముందు డెలివరీ చేసిన ఫుడ్‌ వాసన తర్వాత ఆర్డర్‌కు ఎంతోకొంత అంటుకుంటుంది. అందుకే ఫ్లీట్‌ను విభజించాల్సి వచ్చింది. కొంతమంది వారి మతం లేదా కులంతో సంబంధం లేకుండా మాంసాహారం వండని హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్‌ తెప్పించుకుంటుంటారు. వారిని దృష్టిలో ఉంచుకునే దీన్ని తీసుకొచ్చాం’’ అని గోయల్ వివరణ ఇచ్చారు. 

శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ (Zomato Pure Veg Fleet) పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభిస్తున్నట్లు గోయల్‌ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. శాకాహారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ సేవను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని వెల్లడించారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారంట్ల ఎంపిక, నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయని తెలిపారు. ఫ్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుంది. అయితే, ఈ కొత్త సేవలపై ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో యూనిఫామ్‌ విషయంలో మార్పులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని