Wipro: వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు విప్రో సమాచారం

వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు విప్రో ఇ-మెయిల్‌ పంపింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపింది.

Published : 06 Oct 2022 03:09 IST

దిల్లీ: వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని ఇ-మెయిల్‌ ద్వారా మంగళవారం వారికి తెలియజేసింది. అక్టోబరు 10 నుంచి కార్యాలయాలు తెరిచి ఉంటాయని తెలిపింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో.. ఏదైనా మూడు రోజులు ఆఫీసుకు రావొచ్చని పేర్కొంది. బుధవారం మాత్రం కార్యాలయాలు మూసి ఉంచుతున్నట్లు తెలిపింది. హైబ్రిడ్‌ పని విధానాన్ని కొనసాగిస్తూనే ఉద్యోగుల మధ్య అనుబంధం, బృందస్ఫూర్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

విప్రో నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్‌ (NITES) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఉన్నపళంగా ఆఫీసుకు రమ్మని పిలవడం సమంజసం కాదని పేర్కొంది. కనీసం నెల సమయం ఇవ్వాల్సిందని అభిప్రాయపడింది. తద్వారా ఉద్యోగులు కావాల్సిన ప్రాంతాలకు చేరుకొని అక్కడ సర్దుబాటు కావడానికి సరిపడా సమయం లభించేదని తెలిపింది. అలాగే ఆఫీసుకు రావడంపై ఉద్యోగుల అభిప్రాయాల్ని ముందుగా తెలుసుకోవాల్సిందని హితవు పలికింది.

భారత్‌లో ఐటీ సేవల సంస్థలు తమ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. గతనెల టీసీఎస్‌ సైతం వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశించింది. ఏ మూడు రోజులు రావాలో తమ బృంద నాయకులు, మానవ వనరుల విభాగంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని