Wipro CEO step down: విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా

విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్‌ పల్లియా నియమితులయ్యారు.

Updated : 06 Apr 2024 20:24 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో (Wipro) కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా థియరీ డెలాపోర్టే (Thierry Delaporte) రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్‌ పల్లియా కంపెనీ నియమించింది. తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు బీఎస్‌ఈకి సమాచారం ఇచ్చింది. ఏప్రిల్‌ 6 నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని విప్రో బోర్డు పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో డెలాపోర్టే వైదొలిగారని, ఈ ఏడాది మే 31 నుంచి కంపెనీలోని ఉద్యోగ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంటారని తెలిపింది. ఏప్రిల్‌ 7 నుంచి శ్రీనివాస్‌ పల్లియా నియామకం అమల్లోకి రానుందని, ఐదేళ్ల కాలానికి ఈ పదవిలో ఆయన కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.

డెలాపోర్టే అంతకుముందు క్యాప్‌జెమినీ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 2020లో విప్రో సీఈఓగా నియమితులయ్యారు. నాలుగేళ్లుగా సీఈఓగా, ఎండీగా విప్రోలో సేవలందించారు. తన పదవీకాలంపై సంతృప్తి వ్యక్తంచేశారు. విప్రో వృద్ధి, విజయంలో తన వంతు పాత్ర పోషించడాన్ని తనకు దక్కిన అపుర్వ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాస్‌ పల్లియా మూడు దశాబ్దాలుగా విప్రోలో పనిచేస్తున్నారు. విప్రో కన్జ్యూమర్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌గా, అమెరికాస్‌ 1 సీఈఓగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు