Q4 Results: టెక్‌ మహీంద్రా లాభం 27% క్షీణత.. షేర్ల బై బ్యాక్‌ ప్రకటించిన విప్రో

Tech Mahindra and Wipro Q4 Results: ప్రముఖ ఐటీ సంస్థలు టెక్‌ మహీంద్రా, విప్రో త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకరమైన ఫలితాలను నమోదు చేశాయి.

Published : 27 Apr 2023 21:08 IST

ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, టెక్‌ మహీంద్రా త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. టెక్‌ మహీంద్రా నిరుత్సాహకర ఫలితాలను నమోదు చేయగా.. విప్రో లాభం సైతం స్వల్పంగా తగ్గింది.

దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో త్రైమాసిక ఫలితాల్లో నిరాశ పరిచింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.3,074.5 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,087 కోట్లతో పోలిస్తే లాభం 0.40 శాతం మేర తగ్గడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో రూ.23,190.3 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 11.17 శాతం అధికం.

మొత్తం ఏడాదికి సంబంధించి విప్రో రూ.11,350 కోట్ల నికర లాభాన్ని, రూ.90,487.6 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అలాగే, రూ.12 వేల కోట్లు విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయాలని బోర్డు నిర్ణయించిందని విప్రో తన ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం 26.96 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.445 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 

టెక్‌ మహీంద్రా లాభంలో 27 శాతం క్షీణత

మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా నిరుత్సాహ పరిచింది. చివరి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 27 శాతం క్షీణించి 1179.8 కోట్లుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే సంస్థ రూ.1637.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. మొత్తం ఆదాయం మాత్రం రూ.12,436.1 కోట్ల నుంచి రూ.14,023.7 కోట్లకు పెరిగింది. మొత్తం ఏడాదికి గానూ రూ.5,137.6 కోట్ల నికర లాభాన్ని టెక్‌ మహీంద్రా నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని