Ratan Tata: తాజ్‌ మహల్‌ హోటల్‌కు అసలైన అందం అదే.. రతన్‌ టాటాకు హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు..!

రతన్‌ టాటా గొప్ప వ్యాపారే కాదు.. అంతకు మించిన జంతుప్రేమికుడు. ఆయన చర్యలు ఎన్నోసార్లు దేశ ప్రజల హృదయాలను గెలుచుకొన్నాయి. తాజాగా అలాంటి విషయమే మరొకటి వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే..

Updated : 29 May 2024 12:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తాజ్‌ మహల్‌ హోటల్‌’ ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది సంపదే.. దేశంలోనే పేరున్న వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ముంబయిలో సేదదీరడానికి వచ్చే ప్రదేశం. అడుగడుగునా రాజరికం ఉట్టిపడుతుంటుంది. ఇందులో ఓ మానవీయ కోణం కూడా ఉంది. రతన్‌ టాటా (Ratan Tata) మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్‌ ఓ నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్‌ఆర్‌ నిపుణురాలు రుబీ ఖాన్‌ తన లింక్డిన్‌ పోస్టులో వెల్లడించారు. 

తాను ఆ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశద్వారం పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు. చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం రావడంతో.. అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు వెల్లడించారు. వారు చెప్పిన సమాధానం విని రతన్‌టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ‘‘ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్‌లో ఓ భాగమైపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయి’’ అని సిబ్బంది వెల్లడించినట్లు రాసుకొచ్చారు.

నిత్యం వీఐపీలు వచ్చే ప్రతిష్ఠాత్మక సంస్థ వద్ద ఆ శునకం ప్రశాంతంగా నిద్రపోవడం తన మనసును తాకిందని రూబీ పేర్కొన్నారు. చాలా మంది అతిథులు అసలు దానిని గమనించి ఉండరన్నారు. ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశాన్ని అది సొంతదిగా భావించిందని ముచ్చటపడ్డారు. మనం తరచూ చెప్పే కలుపుగోలుతనం, సైకలాజికల్‌ సేఫ్టీ, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి ఇక్కడ కార్యాచరణలో కనిపించాయన్నారు. ఈ పోస్టు లింక్డిన్‌లో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు రతన్‌టాటా మానవత్వానికి ఫిదా అయ్యారు. 

రతన్‌ టాటా మూగజీవాలపై ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. ఆయన తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్‌లో వీధి శునకాలకు ఏకంగా ప్రత్యేక గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. గతేడాది వర్షాకాలం ప్రారంభంలో రతన్‌ టాటా తన ఇన్‌స్టా ఖాతాలో వాహనదారులకు ఓ అభ్యర్థన చేశారు. ‘వానాకాలం వచ్చేసింది. ఈ సమయంలో మన కార్ల కింద పిల్లులు, వీధి కుక్కలు తలదాచుకుంటుంటాయి. కారును ముందుకు పోనిచ్చేటప్పుడు దాని కింద ఒకసారి తనిఖీ చేసుకోండి. లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో, అవయవాలను కోల్పోవడమో, చనిపోవడమో జరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీరు మూగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది’ అని పోస్టు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని