Artificial intelligence: ఏఐ నైపుణ్యాలుంటే.. భలే జీతం!

కృత్రిమ మేధ నైపుణ్యాలను కలిగిన ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశముందని అమెజాన్‌ అనుబంధ సంస్థ అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) నిర్వహించిన పరిశోధనలో తేలింది.

Updated : 20 Mar 2024 05:22 IST

దిల్లీ: కృత్రిమమేధ (Artificial intelligence) నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు (Employees) భారీ జీతాలు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. భారత్‌లో ఏఐ స్కిల్స్ ఉన్నవారికి 54 శాతం కంటే ఎక్కువ జీతం పెరిగే వీలుందని ఉందని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఐటీ, రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌ సెక్టార్లలో పని చేసేవారికి మరింత మేలు చేకూరుతుందని పేర్కొంది. 2028 నాటికి దేశంలోని 99 శాతం మంది యజమానులు తమ కంపెనీలను ఏఐ ఆధారిత సంస్థలుగా మార్చే అవకాశం ఉందని ఏడబ్ల్యూఎస్‌ తన నివేదికలో పేర్కొంది. తద్వారా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఐటీ, రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, మానవ వనరుల విభాగాల్లో ఏఐ సేవలు వినియోగించుకునేందుకు యజమానులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో 98శాతం మంది యజమానులు జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఏడబ్ల్యూఎస్‌ తేల్చింది. 

పరిశోధనలో భాగంగా అమెజాన్‌ అనుబంధ సంస్థ అయిన ఏడబ్ల్యూఎస్‌ 1,600 మంది కార్మికులు, 500 సంస్థల యజమానులపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులనే నియమించుకునేందుకు సంస్థలు మొగ్గు చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, 79 శాతం మంది యజమానులకు అది సాధ్యపడటం లేదని, దీనికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తల సహకారం అవసరమని తెలిపింది. భారత్‌లో కృత్రిమ మేధను మరింత అభివృద్ధి చేసి క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఏడబ్ల్యూఎస్‌.. ఏఐ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు 95 శాతం మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు విప్రో, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఐరిస్‌ సాఫ్ట్‌వేర్‌ తదితర సంస్థల ఉద్యోగులకు ఆయా రంగాల్లో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు తాము సహకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్‌- ఇండియా అధిపతి అమిత్‌ మెహతా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని