Bajaj Auto: బజాజ్‌ ఆటో నుంచి తొలి CNG బైక్‌ వచ్చేది అప్పుడే!

Bajaj Auto: బజాజ్‌ ఆటో సీఎస్‌జీ విభాగంలో ద్విచక్ర వాహనాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది. వచ్చే ఏడాది నాటికి తొలి బైక్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Published : 31 Jan 2024 22:25 IST

\

Bajaj Auto | దిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj Auto) ద్విచక్ర వాహన విభాగంలో కొత్తదనానికి నాంది పలకనుంది. ఇప్పటికే సీఎన్‌జీతో నడిచే త్రీవీలర్‌ వాహన విభాగంలో సత్తా చాటుతున్న ఆ కంపెనీ.. ద్విచక్ర వాహనాల్లోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి సీఎన్‌జీ (CNG) బైక్‌ను తీసుకురానుంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ బుధవారం వెల్లడించారు. 

‘‘దేశానికి, సమాజానికీ సీఎన్‌జీ సరైన ఎంపిక. ఈ విషయం త్రీ వీలర్‌ వాహనాల ద్వారా రుజువైంది. ఇప్పుడు ద్విచక్ర వాహనాల ద్వారా మరోసారి నిరూపించనున్నాం. ఉత్పత్తి వ్యయం కారణంగా సీఎన్‌జీతో రానున్న బైకులు పెట్రోల్‌తో నడిచే వాటి కంటే ఎక్కువ ధర ఉండనున్నాయి’’ అని శర్మ అన్నారు. అయితే, సీఎన్‌జీ వాహనాలపై జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది కస్టమర్లకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

‘‘2020లో త్రీ-వీలర్‌ విభాగంలో సీఎన్‌జీ వినియోగం కేవలం 25 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరింది. 2020లో 2,000 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి ఆ సంఖ్య 8 వేలకు చేరుతుందని ఆశిస్తున్నా. సీఎన్‌జీ ఫ్లిల్లింగ్‌ స్టేషన్లను విస్తరణను ప్రభుత్వం వేగవంతం చేయడంతో వాహనాల విక్రయాలు పెరిగాయి’’ అని బజాజ్‌ ఆటో ఈడీ తెలిపారు. సీఎన్‌జీ అనేది శిలాజ ఇంధనం అయినప్పటికీ ఇతర ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం తక్కువన్నారు. ఫిబ్రవరి 1న జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఫ్లెక్స్ ఇంధనం, మోనో ఫ్యూయల్, సీఎన్‌జీ వాహనాలను బజాజ్ ఆటో ప్రదర్శించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని