Social Media X: కొన్ని ‘ఎక్స్‌’ ఖాతాల నిలిపివేతకు కేంద్రం ఆదేశం!

Social Media X: రైతుల ఆందోళనలతో సంబంధం ఉన్న కొన్ని ఖాతాలు, పోస్టులను నిలిపివేయాలని ‘ఎక్స్‌’ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

Updated : 22 Feb 2024 11:15 IST

దిల్లీ: భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాల్సిందిగా తమకు ఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్‌ (Social Media X) బుధవారం వెల్లడించింది. అందుకనుగుణంగా వాటిని నిలిపివేశామని తెలిపింది. అయితే, ఇలాంటి చర్యలతో తాము విభేదిస్తున్నామని పేర్కొంది. తమ వేదికపై ప్రతిఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది.

తమ విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు ఎక్స్‌ (Social Media X) వెల్లడించింది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. అలాగే తమ చర్యల కారణంగా ప్రభావితమైన యూజర్లకు నోటీసులు కూడా అందించామని చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేయలేకపోతున్నామని తెలిపింది. కానీ, పారదర్శకత కోసం వాటిని అందరి ముందు ఉంచడం చాలా అవసరమని వ్యాఖ్యానించింది. లేదంటే జవాబుదారీతనం లోపిస్తుందని.. ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు (Farmers Protest) సంబంధించిన దాదాపు 177 ఖాతాలను బ్లాక్‌ చేయాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను ఆదేశించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అన్నదాతల ఆందోళనతో పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించిన విషయం తెలిసిందే. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు తీవ్ర గాయమై ఓ యువరైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులూ గాయపడ్డారు. 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు ఎక్స్‌ ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు