Year Ender 2023: పసిడి మెరుపులు.. భారీ GST వసూళ్లు.. రికార్డు యూపీఐ లావాదేవీలు..!

గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తోంది. ఈ క్రమంలో 2023లో పలు కీలక పరిణామాలను చవిచూసింది.

Updated : 28 Dec 2023 11:50 IST

Year Ender 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తోంది. ఈ క్రమంలో 2023లో పలు కీలక పరిణామాలను చవిచూసింది. పెరిగిన స్థిరత్వం, మరింత ఆశావాదంతో బలమైన వృద్ధి, భవిష్యత్‌ అవకాశాలను ఒడిసి పట్టేందుకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ఆర్థిక అంశాల్లో భారత్‌ పనితీరు ఎలా ఉందో చూద్దాం..!

ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా..

3.75 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం రూ.98,374గా ఉంది. 2027 నాటికి మన దేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైకేల్‌ డి పాత్రా ఇటీవల అంచనా వేశారు. 

ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి..

సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జులై-సెప్టెంబరులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.2 శాతంగా నమోదైంది. 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలోనూ హవా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ ఇటీవల అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 6.5 శాతం వృద్ధిని సౌకర్యవంతంగా నమోదు చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 16 శాతానికి పైనే ఉంటుందని ఇటీవల ఐఎంఎఫ్‌ తెలిపింది.

నెమ్మదించిన ఎఫ్‌డీఐలు..

భారత్‌లోకి 2023లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించింది. జనవరి- సెప్టెంబర్‌ మధ్య ఎఫ్‌డీఐలు 22 శాతం తగ్గి 48.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2014-23 మధ్య మొత్తం 596 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలను భారత్‌ ఆకర్షించినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల నేపథ్యంలో 2024లో భారీ ఎత్తున ఎఫ్‌డీఐలు వస్తాయని అంచనా వేసింది.

పన్ను వసూళ్లు ఇలా..

2023-24లో అక్టోబరు వరకు ప్రభుత్వ పన్ను ఆదాయం రూ.13.01 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.2.65 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు అక్టోబర్‌ 31 నాటికి 7.85 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల వెల్లడించింది. క్రితం ఏడాదితో పోలిస్తే 11.7 శాతం వృద్ధి నమోదైంది.

UPI లావాదేవీల్లో 50% పెరుగుదల..

ఈ ఏడాది నవంబర్‌లో యూపీఐ చెల్లింపులు రూ.17.40 లక్షల కోట్లతో రికార్డు స్థాయికి చేరాయి. వార్షిక ప్రాతిపదికన ఆ నెలలో 46 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. మొత్తంగా 2023- 24లో ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీల విలువలో సగటున 40 శాతం వృద్ధి నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే 50 శాతం పెరిగాయి. 2022-23లో 8,376 కోట్ల లావాదేవీల్లో రూ.139 లక్షల కోట్ల విలువ చేసే యూపీఐ చెల్లింపులు జరిగాయి.

13 కోట్ల 5జీ సబ్‌స్క్రైబర్లు..

భారత్‌లో 2022 అక్టోబర్‌లో ప్రారంభమైన 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరించింది. తొలి 14 నెలల్లో 13 కోట్ల మంది యూజర్లు 5జీకి మారారు. దేశీయ టెలికాం సంస్థలు ఇప్పటి వరకు నాలుగు లక్షల టవర్లను 5జీతో అనుసంధానం చేశాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

50 శాతం పెరిగిన ఈవీ విక్రయాలు..   

వాహన్‌ డేటాబేస్‌ ప్రకారం ఇప్పటి వరకు భారత్‌లో 34.54 లక్షల విద్యుత్‌ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. 2023 తొలి 11 నెలల్లో 13.87 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వాహనాల్లో ఈవీల వాటా మాత్రం ఇంకా 2.4 శాతం వద్దే ఉండడం గమనార్హం.

బంగారం మెరుపులు..

ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2023 ఆరంభమయ్యే నాటికి 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు) ధర రూ.55,040గా ఉండేది. డిసెంబర్‌ 26 నాటికి అది రూ.63,710కి చేరింది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ ఒక్క ఏడాదిలోనే రూ.8,670 (15.75%) మేర పెరిగింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు.

రికార్డు జీఎస్‌టీ వసూళ్లు..

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లలోనూ ఈ ఏడాది రికార్డులు నమోదయ్యాయి. నవంబరులో రూ.1.68 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి. 2022 నవంబరుతో పోలిస్తే ఇవి 15 శాతం అధికం. ఈ ఏడాది ప్రతినెలా సగటున రూ.1.66 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఇటీవల కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ నుంచి రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని