Zomato: ఎక్స్‌ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్‌ డెలివరీలు సేవలు..!

Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది.

Published : 25 Apr 2024 15:05 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ప్రాధాన్యం లేని రోజుల్లో డెలివరీలు చాలా త్వరగా అందేవి. రానురానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆర్డర్‌ చేతికందాలంటే కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. అందులోనూ వారాంతాల్లో అయితే మరీ ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రముఖ ఆహార సేవల సంస్థ జొమాటో (Zomato) ఫుడ్‌ ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు సిద్ధమవుతోంది. ఫాస్ట్‌ డెలివరీ సేవలను ప్రారంభించబోతోంది. ఇందుకుగానూ కొంత అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు, ముంబయి నగరాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఫాస్ట్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది.

జొమాటో ప్లాట్‌ఫామ్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేటప్పుడే ఈ ఫాస్ట్‌ డెలివరీ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. బెంగళూరు, ముంబయి నగరాల్లోని ఎంపిక చేసిన రెస్టరంట్లకు ఈ ఫీచర్‌ను జోడించింది. దీనికి అదనపు ఛార్జీలను నిర్దేశించింది. ఉదాహరణకు బెంగళూరులోని ఓ కస్టమర్‌ 16-21 నిమిషాల్లోనే తన ఆర్డర్‌ డెలివరీ కావాలనుకుంటే అదనంగా రూ.29 చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సాధారణ డెలివరీ సమయం కంటే కాస్త ముందుగా అందించడం ఈ సదుపాయం ఉద్దేశం. జొమాటో గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లు కూడా ఫాస్ట్‌ డెలివరీ కోసం అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఇంకా టెస్టింగ్‌ దశలోనే ఉంది. విజయవంతం అయితే మరిన్ని నగరాలకు ఈ సేవల్ని విస్తరించాలని జొమాటో చూస్తోంది.

రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్‌.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..

ఫుడ్‌ డెలివరీ సేవల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు జొమాటో శ్రీకారం చుడుతూ వస్తోంది. ఆ మధ్య వెజిటేరియన్ల కోసం ప్రత్యేక ఫ్లీట్‌ను తీసుకొచ్చిన ఆ సంస్థ.. పెద్ద పెద్ద ఆర్డర్ల డెలివరీ కోసం విద్యుత్‌ వాహనాలను కూడా ప్రారంభించింది. మరోవైపు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడం కోసం ఎంపిక చేసిన నగరాల్లో తన ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. స్విగ్గీ కూడా ప్లాట్‌ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5 చొప్పున వసూలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని