Kotak Gen Insurance: కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో జూరిచ్‌ ఇన్సూరెన్స్‌కు 51% వాటా

Kotak Gen Insurance: కంపెనీ విస్తరణ కోసం కొత్తగా మూలధనాన్ని అందించడంతో పాటు షేర్ల కొనుగోలు రూపంలో జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ఈ కొనుగోలును పూర్తి చేయనున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది.

Updated : 02 Nov 2023 15:14 IST

ముంబయి: తమ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ 51 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు మాతృసంస్థ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఈ కొనుగోలు ఒప్పంద విలువ రూ.4,051 కోట్లుగా తెలిపింది. కంపెనీ విస్తరణ కోసం కొత్తగా మూలధనాన్ని అందించడంతో పాటు షేర్ల కొనుగోలు రూపంలో జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ఈ కొనుగోలును పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. రాబోయే మూడేళ్లలో మరో 19 శాతం వాటాను కూడా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది.

నాన్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ వాటా సెప్టెంబర్‌ నాటికి ప్రీమియంల పరంగా 0.52 శాతం. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల ప్రీమియం వసూళ్లు రూ.1,148 కోట్లుగా నమోదైంది. షేర్ల విక్రయాల పరంగా చూస్తే కంపెనీ విలువ రూ.7,913 కోట్లని అంచనా. ఇరు కంపెనీల మధ్య కుదిరిన తాజా కొనుగోలు ఒప్పందానికి ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, సీసీఐల నుంచి అనుమతి లభించాల్సి ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కోటక్‌ జనరల్‌ నష్టాలు వార్షిక ప్రాతిపదికన రూ.17 కోట్ల నుంచి రూ.7 కోట్లకు తగ్గాయి.

భారత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు లభించినప్పటి నుంచి విదేశీ కంపెనీలు దేశీయ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో తమ వాటాలను క్రమంగా పెంచుకుంటుండటం గమనార్హం. జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు