చెప్పులతో కొట్టి.. తాళ్లతో కట్టిపడేసి..షెల్టర్‌ హోంలో చిన్నారులపై దాష్టీకం

Crime News: పసిపిల్లల ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యతను మరిచి ఓ అధికారిణి ఇష్టారీతిగా వ్యవహరించింది. చిన్నారులనే కనికరం లేకుండా చెప్పులతో కొట్టి, తాళ్లతో కట్టిపడేసింది. 

Published : 14 Sep 2023 16:37 IST

ఆగ్రా: పసిపిల్లలు బాగోగులు చూడటమే ఆమె వృత్తి. కానీ దానికి న్యాయం చేయకుండా  ఆమె చిన్నారులతో నిర్దయగా వ్యవహరించింది. వారిని చెప్పులతో కొట్టడం, చేతులు కాళ్లు తాడుతో బిగించి, మంచానికి కట్టేయడం వంటి  దారుణాలకు ఒడిగట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఆగ్రా(Agra)లో ప్రభుత్వ పరిధిలోని జువెనైల్‌ హోం(juvenile home) రాజకీయ బాల్‌ గృహ్‌కు చెందిన అధికారిణి ఈ ఆగడాలకు పాల్పడ్డారు.  ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. (Horror At Juvenile Home)

ఒక వీడియోలో చిన్నారులు బెడ్‌పై నిద్రిస్తున్నారు. అందులో ఓ చిన్నారి వద్దకు వేగంగా వచ్చిన అధికారిణి చెప్పు తీసుకొని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆమె వెంట ఉన్న ఇద్దరు సిబ్బంది పక్కన నిలబడి ఈ నిర్వాకాన్ని చూస్తుండిపోయారు. తర్వాత మరికొందరు చిన్నారులతోనూ దురుసుగా ప్రవర్తించారు. మరో వీడియోలో ఏడేళ్లు కూడా లేని చిన్నారిని తాడుతో బంధించడంతో ఓ మంచం పక్కన పడుకొని ఉండటం కనిపించింది. సదరు అధికారిణి పేరు పూనమ్‌ పాల్ అని, ఆమె ఆ హోం సూపరింటెండెంట్ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైంది.

ఆ ఫోన్‌ ఇక మోగదు.. ఆ పసికందు కోసం తండ్రెప్పటికీ రారు..!

అలాగే ఆగ్రా జిల్లా జడ్జి, అడిషనల్ జిల్లా జడ్జి, షెల్టర్‌ హోం కమిటీ ఛైర్‌పర్సన్ ఈ హోంను తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి తీవ్రస్థాయి నిర్వహణాలోపం కనిపించింది. బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులు ఒక గదిలో గుర్తించారు. అలాగే పిల్లలకు తగినంత ఆహారం ఇవ్వడం లేదని తేలింది. ఈ ఘటనపై దర్యాప్తు అధికారులు పూనమ్‌పాల్‌ను విచారించారు.

ఇదిలా ఉంటే.. ఇదివరకు ప్రయాగ్‌ రాజ్‌లోని జువెనైల్‌ హోం(juvenile home)లో కూడా పూనమ్‌ ఈ విధంగానే ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ 2021లో 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పురిగొల్పిందనే ఆరోపణలతో పాల్‌పై కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని