రూపాలు మార్చి.. సరిహద్దులు దాటి!

కొంతమంది లంచగొండుల వల్ల పోలీసులంటే పలువురిలో చులకన భావమే! విధి నిర్వహణలో వారు ఎంత తెగింపు, చొరవ చూపినా కొన్ని సందర్భాల్లో గుర్తింపు ఉండదు.

Updated : 05 Dec 2022 04:43 IST

గంజాయి కేసుల్లో పరారైన 77 మంది పట్టివేత
రోలుగుంట ఎస్సై, సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు

గంజాయి నిందితులతో పోలీసులు (దాచిన చిత్రం)

రోలుగుంట (చోడవరం), న్యూస్‌టుడే: కొంతమంది లంచగొండుల వల్ల పోలీసులంటే పలువురిలో చులకన భావమే! విధి నిర్వహణలో వారు ఎంత తెగింపు, చొరవ చూపినా కొన్ని సందర్భాల్లో గుర్తింపు ఉండదు. ఈ ఆలోచనలకు, ఆరోపణలకు చెక్‌ పెట్టేలా రోలుగుంట పోలీసులు పనితీరు చూపించారు. మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌.డి.పి.ఎస్‌.) కేసులకు సంబంధించి పరారైన 77 మందిని 16 నెలల వ్యవధిలో పట్టుకున్నారు. దీనికోసం ఎస్సై, సిబ్బంది మారువేషాల్లో అన్వేషించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖనగరం, రాజమహేంద్రవరం, పలాస, కాకినాడ, తదితర ప్రాంతాలతోపాటు సరిహద్దులు దాటి ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో దాక్కున్న నిందితులను సైతం అరెస్ట్‌ చేశారు. ఉన్నతాధికారుల నుంచి పురస్కారాలు అందుకుని మార్గదర్శకంగా నిలిచారు. గంజాయి నిందితుల్లో పరివర్తన కోసం అవగాహన కల్పిస్తున్నారు.

గంజాయి అక్రమ రవాణాలో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంతో పాటు రోలుగుంట మండలం బి.బి.పట్నంపై మచ్చ ఉంది. ఏడాది క్రితం వరకూ ఈ గ్రామానికి చెందిన జైల్లో ఉన్న గంజాయి నిందితులే కాకుండా 50 మందికి పైగా పరారయ్యారు. దీనిపై నేర సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తావించేవారు. జిల్లా ఎస్పీ గౌతమి సాలి దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అప్పటికే బి.బి.పట్నంతోపాటు మరికొన్ని గ్రామాలకు చెందిన సుమారు 83 మంది నిందితుల ఆచూకీ దొరకలేదు. 16 నెలల క్రితం రోలుగుంట ఎస్సైగా చేరిన నాగకార్తీక్‌కు ఈ బాధ్యతను అప్పగించారు. ఆయన హెచ్‌సీ ముత్యాలనాయుడు, కానిస్టేబుల్‌ సంతోష్‌ సహాయంతో మారువేషాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లి 77 మందిని అరెస్టు చేశారు. బి.బి.పట్నం గ్రామానికి చెందిన 50 మంది పరారవ్వగా వారిలో 48 మందిని అరెస్టు చేశారు. 16 నెలల్లోనే 2064 కేజీల గంజాయి, 35 సెల్‌ఫోన్లు, ఆరు కార్లు, అయిదు బైక్‌లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకుని 45 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు ఎస్పీ నుంచి ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు.


తల్లిదండ్రులు, పెద్దలతో సమావేశాలు

గంజాయి కేసులకు సంబంధించి యువతపై ప్రభావం చూపకుండా నేర ప్రవృత్తి గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో యువకుల తల్లిదండ్రులు, నాయకులు. గ్రామపెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. దీనికోసం ఎస్పీ, నర్సీపట్నం ఏఎస్పీ, కొత్తకోట సి.ఐ. ఇస్తున్న సూచనలను అనుసరిస్తున్నాం.

బి.నాగకార్తీక్‌, ఎస్సై, రోలుగుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని