మట్టిపాలైన బతుకులు!

రోజువారీగా కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్న పేదలు వారు.. కిరాణా దుకాణానికి వెళ్తున్న ఆ ముగ్గురిని వర్షానికి తడిసిన పురాతన మట్టి గోడ బలితీసుకుంది. పేద కుటుంబాల్లో విషాదం నింపింది.

Published : 23 Sep 2023 04:03 IST

గోడ కూలి ముగ్గురి దుర్మరణం
హనుమకొండ జిల్లాలో విషాదం

శాయంపేట, న్యూస్‌టుడే: రోజువారీగా కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్న పేదలు వారు.. కిరాణా దుకాణానికి వెళ్తున్న ఆ ముగ్గురిని వర్షానికి తడిసిన పురాతన మట్టి గోడ బలితీసుకుంది. పేద కుటుంబాల్లో విషాదం నింపింది. హనుమకొండ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండల కేంద్రానికి చెందిన మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(50), భోగి జోగమ్మ(65) శుక్రవారం ఉదయం నిత్యావసరాల కొనుగోలు కోసం సమీపంలోని కిరాణా దుకాణానికి ఓ మట్టి గోడ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆ పురాతన గోడ వీరిపై ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఈ ముగ్గురూ గోడ మట్టి, ఇటుక పెళ్లల్లో కూరుకుపోయారు. గమనించిన స్థానికులు వీరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన పెద్దసాంబయ్య, సారలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జోగమ్మను అంబులెన్స్‌లో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. వీరిలో పెద్దసాంబయ్య సిరిసిల్లలో రోజువారీగా మగ్గం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పింఛను తీసుకోవడానికి ఇటీవల శాయంపేటకు వచ్చారు. సారలక్ష్మి, జోగమ్మలు వితంతువులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై దేవేందర్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు