ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె

ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు.

Published : 11 May 2024 07:03 IST

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు..మిరుదొడ్డికి చెందిన నేరండ్ల యాదవ్‌గౌడ్‌ (58)కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కాగా కొద్ది నెలల క్రితం ఓ కుమార్తె మరణించింది. యాదవ్‌ గౌడ్‌ తనకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం ధాన్యం తరలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం కుప్పలు తడవడంతో రోజూ వాటిని ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో ఎండ, వానలకు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం సాయంత్రం మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూసి మళ్లీ ధాన్యం తడిసిపోతుందనే భయంతో త్వరత్వరగా వడ్లను కుప్ప వేసేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. సమీపంలోని రైతులు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో యాదవ్‌గౌడ్‌ మృతి చెందారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని