డ్రగ్స్‌ తయారీ మాఫియా గుట్టురట్టు

గుజరాత్‌, రాజస్థాన్‌లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్‌ ల్యాబ్‌లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ), గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి.

Updated : 28 Apr 2024 05:32 IST

గుజరాత్‌, రాజస్థాన్‌లలోని 4 కేంద్రాలపై దాడులు

దిల్లీ: గుజరాత్‌, రాజస్థాన్‌లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్‌ ల్యాబ్‌లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ), గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్‌) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. రూ.230 కోట్ల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించాయి. రాజస్థాన్‌లోని జలోర్‌, జోధ్‌పుర్‌ జిల్లాల్లో నడుపుతున్న డ్రగ్‌ తయారీ ల్యాబ్‌లపై మూడు నెలలుగా నిఘా వేసిన అధికారులు శుక్రవారం దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ద్రవ, పొడి రూపంలో ఉన్న 149 కిలోల మెఫెడ్రోన్‌, 50 కిలోల ఎఫెడ్రిన్‌, 200 లీటర్ల అసెటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సమీప పిప్లాజ్‌ గ్రామం, అమ్రేలీ జిల్లా భక్తినగర్‌ పారిశ్రామిక ప్రాంతంలోని రెండు డ్రగ్‌ తయారీ కేంద్రాలపైనా దాడులు చేసినట్లు ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. ఇక్కడ పొడి రూపంలో ఉన్న 22 కిలోల మెఫెడ్రోన్‌, ద్రవ రూపంలో ఉన్న 124 కిలోల మెఫెడ్రోన్‌ లభించినట్లు తెలిపారు. డ్రగ్స్‌ ముఠా ప్రధాన సూత్రధారిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ మాఫియా విస్తరణపై దర్యాప్తు జరుగుతోందని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని