Crime News: రాజుది ముమ్మాటికీ బలవన్మరణం కాదు

స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై చనిపోయిన రాజుది బలవన్మరణం కాదని అతడి భార్య మౌనిక, తల్లి వీరమ్మ, సోదరి అనిత అన్నారు. పోలీసులే అక్కడికి

Updated : 17 Sep 2021 19:49 IST

కాల్చిచంపాలని ఆర్డరొచ్చిందని పోలీసులు అనుకుంటుంటే విన్నా: రాజు తల్లి

అడ్డగూడూరు, న్యూస్‌టుడే : స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై చనిపోయిన రాజుది బలవన్మరణం కాదని అతడి భార్య మౌనిక, తల్లి వీరమ్మ, సోదరి అనిత అన్నారు. పోలీసులే అక్కడికి తీసుకెళ్లి చంపి బలవన్మరణంగా చిత్రీకరించారని ఆరోపించారు. రాజు చనిపోయిన విషయాన్ని టీవీల ద్వారా తెలుసుకుని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అతడి సోదరి ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10న పోలీసులు వచ్చి సమాచారం ఇవ్వకుండా తమను హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారని చెప్పారు. గతంలో రాజు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రదేశాలను చూపించాలంటూ ఐదురోజుల పాటు జీపులో పలుచోట్లకు తీసుకెళ్లారని తెలిపారు. రాజు శరీరంపై ఉన్న ఆనవాళ్ల గురించి మౌనికను బుధవారం పలుమార్లు అడిగి తెలుసుకున్నారన్నారు. అదేరోజు రాత్రి ఛార్జీలకు డబ్బులిచ్చి తమను ఇంటికి వెళ్లిపోవాలంటూ ఉప్పల్‌ బస్టాండ్‌లో బస్సు ఎక్కించారని పేర్కొన్నారు. రాజును కాల్చిచంపమని ఆర్డరు వచ్చిందని పోలీసులు అనుకుంటుంటే విన్నామని, మనుమరాలిని బాగా చూసుకోవాలన్నారని చెప్పారని మృతుని తల్లి వీరమ్మ ఆరోపించారు. రాజు దొరికితేనే వదిలిపెడతామని, లేదంటే మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తామన్నారని చెప్పారు. రెండు రోజుల క్రితమే రైల్వేస్టేషన్‌లో రాజు దొరికినట్లు చెప్పారన్నారు. రైల్వేట్రాక్‌పై రాజు బలవన్మరణం చెందారనే వార్తను గురువారం టీవీలో చూసి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష విధించడానికి కోర్టు ఉందని, కోర్టు విధించే ఏ శిక్షకైనా తాము కట్టుబడి ఉండేవాళ్లమని తల్లి వీరమ్మ చెప్పారు. మృతదేహాన్ని మొదట తీసుకెళ్తామని చెప్పినా తరువాత తమకు ఇల్లు లేదని రాజు భార్య మౌనిక నిరాకరించారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో శవాన్ని గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు పోలీసులు అడ్డగూడూరుకు చేరుకొని రాజు తల్లి, భార్య, సోదరిని తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని