scam alert: హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ పేరిట లింక్‌ పంపి రూ.2.5 లక్షలకు టోకరా!

Scam alert: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆసరాగా చేసుకొని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. హెచ్‌ఆర్‌ రౌండ్‌ అంటూ ఫేక్‌ లింక్‌ పంపి పెద్ద మొత్తంలో డబ్బును దోచుకుంటున్నారు.

Published : 03 Apr 2024 16:07 IST

scam alert | ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అధిక రాబడులు, ఉద్యోగాలు అంటూ వినూత్న పద్ధతుల్లో ప్రజల్ని బోల్తా కొట్టించి పెద్దఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. తాజాగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి దగ్గర హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అని నమ్మించి రూ.రెండున్నర లక్షలు కొట్టేశారు. 

పుణెకు చెందిన నవేద్ ఆలం అనే ఓ ప్రొడక్ట్‌ డిజైనర్‌ తాజాగా సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ‘ఎక్స్‌’ వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘ఇటీవల ఓ కంపెనీ పేరుతో నడుపుతున్న ఖాతా నుంచి మెసేజ్‌ వచ్చింది. ‘మా ప్లాట్‌ఫామ్‌లో పనిచేయడానికి ఓ డిజైనర్‌ కోసం ఎదురుచూస్తున్నాం. మీ పోర్ట్‌ఫోలియో నచ్చింది’ అంటూ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పాక హెచ్‌ఆర్‌ రౌండ్‌ అంటూ ఓ అభ్యర్థన వచ్చింది. లింక్‌ సాయంతో ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. లింక్‌పై క్లిక్‌ చేయగానే డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ చూపించింది. కమ్యూనికేషన్‌ కోసమే కదా అంటూ చూపించిన దాన్ని డౌన్‌లోడ్‌ చేశాను. అది ఫేక్‌ అకౌంట్‌ అని తెలుసుకోలేకపోయా. అంతే క్షణాల్లో తన క్రిప్టో వాలెట్‌లోని 2000 డాలర్లు (రూ.2.5 లక్షలు) మాయమయ్యాయి’’ అంటూ రాసుకొచ్చారు.

మహారాష్ట్రలో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

అకౌంట్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ కేటుగాళ్లతో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను నవేద్‌ ఆలం పోస్ట్‌ చేశాడు. ఉద్యోగం అంటూ ఏవైనా ఆఫర్లు వస్తే వెంటనే అది నిజమైన సంస్థో.. కాదో తెలుసుకున్నాకే వారు పంపిన లింక్‌లపై క్లిక్‌ చేయండి అంటూ నెటిజన్లు సూచనలు చేశారు. నవేద్‌ పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కొందరు నెటిజన్లు స్పందించారు. ‘‘నేను కూడా ఇలాంటి స్కామ్‌ల బారినపడి పొదుపు చేసిన డబ్బంతా పోగొట్టుకున్నాను’’ అంటూ ఓ యూజర్‌ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇదే తరహాలో చాలామంది తమకు ఎదురైన సంఘటనలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని