‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్‌.. వైద్యురాలి ఆత్మహత్య

వరకట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 08 Dec 2023 02:15 IST

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో (Tiruvanthapuram) ఓ వైద్యురాలు ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రియుడి కుటుంబం చేసిన వరకట్నం డిమాండ్లే ఆమె బలవన్మరణానికి కారణమైందన ఘటన సంచలనం రేపింది. వరకట్నంగా (Dowry) బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల భూమి, 150 సవర్ల బంగారాన్ని వరుడి కుటుంబం డిమాండ్‌ చేయగా.. వాటిని ఇచ్చే స్తోమత లేకపోవడంతో పెళ్లి రద్దయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నిందితుడిని సస్పెండ్‌ చేశారు. వరకట్నాన్ని డిమాండ్‌ చేస్తే ఆ పెళ్లిని తిరస్కరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మహిళలకు పిలుపునిచ్చారు.

అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్‌ను చంపి అడవిలో పడేసి..!

వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురానికి చెందిన డాక్టర్‌ షహానా (26) స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉండేవారు. గల్ఫ్‌లో పనిచేసిన తండ్రి రెండేళ్ల క్రితమే మరణించారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్‌ రువాయిస్‌, షహానా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెళ్లి విషయానికి వచ్చేసరికి రువాయిస్‌ కుటుంబం వరకట్నం డిమాండ్‌ చేసింది. కట్నంగా బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల భూమి, 150 సవర్ల బంగారం ఇవ్వాలని పట్టుబట్టారు. తాము అడిగినంత ఇచ్చే స్తోమత షహానా కుటుంబానికి లేకపోవడంతో రువాయిస్‌ కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన షహానా మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ముమ్మర దర్యాప్తు

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. దర్యాప్తు చేయాలని మహిళ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ను ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్‌ బుధవారమే ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలంలో దొరికిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. షహానా మృతికి రువాయిస్‌ కారణమని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించిన పోలీసులు గురువారం అతడిని అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సతీదేవి పరామర్శించారు. భయపడాల్సిన అవసరం లేదని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మరోవైపు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.

నీ కంటే డబ్బే ముఖ్యమన్నాడు..

తన సోదరి మృతికి రువాయిస్‌, అతడి కుటుంబ సభ్యులే కారణమని షహానా సోదరుడు జాసిమ్‌ నాస్‌ మీడియా ఎదుట వాపోయాడు. ముఖ్యంగా రువాయిస్‌ తండ్రి తమను దుర్భాషలాడారని, కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటూ హేళనగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లు కోరినంత కట్నం ఇవ్వలేకపోయినా, తమకు వీలైనంత ఇస్తామని చెప్పినా అంగీకరించలేదని చెప్పాడు. రువాయిస్‌ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, వాళ్లను ఒప్పించి తన సోదరిని పెళ్లి చేసుకుంటాడనే ఓ చిన్న ఆశ ఉండేదని, అతడు కూడా ‘నీకంటే నాకు డబ్బే ముఖ్యం’ అని చెప్పడంతో షహానా తట్టులేక ఆత్మహత్య చేసుకుందని మీడియాకు వివరించాడు. వరకట్నం కారణంగానే తన పెళ్లి ఆగిపోతోందని షహానా గత కొన్ని రోజులుగా తీవ్ర దుఃఖంలో ఉండేదని ఆమె స్నేహితులు కూడా పేర్కొంటున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని