Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 28 మృతదేహాలు ఇంకా మార్చురీలోనే!

ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బహానగా రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో వెలికితీసిన 28 మృతదేహాలను ఇప్పటి వరకూ ఎవరూ తీసుకెళ్లలేదట.

Published : 04 Sep 2023 22:40 IST

భువనేశ్వర్‌ : ఒడిశా (Odisha)లో ఘోర రైలు దుర్ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా 28 మృతదేహాలు ఎవరివో తెలియరాలేదు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి సంబంధీకులెవరూ ముందుకు రాలేదని భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్ దిలీప్‌ పరిడా వెల్లడించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచామని పేర్కొన్నారు. మరి కొద్దిరోజులు వాటిని భద్రపరిచే వీలుందన్నారు. ‘గత పది రోజులుగా మృతదేహాల కోసం ఎవరూ రాని నేపథ్యంలో ఇక ఎక్కువ మంది వాటి కోసం వచ్చే అవకాశం లేదని భావిస్తున్నాం. ఇప్పటిదాకా దిల్లీలోని సెంట్రల్‌ ఫోర్సెనిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ సాయంతో డీఎన్‌ఏ క్రాస్‌ మ్యాచింగ్‌ ద్వారా మృతదేహాలను వాటి హక్కుదారులకు అప్పగించాం. ఇంకా 28 మృతదేహాలు మా వద్ద ఉన్నాయి. క్లెయిమ్‌ చేసుకోని మృతదేహాలను ఏం చేయాలనే విషయంపై రైల్వేశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం’ అని తెలిపారు.

దెయ్యాలు ఆవహించాయని నవ వధువుపై అత్యాచారం.. నకిలీ బాబా అరెస్టు

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జూన్‌ 2న పరస్పరం ఢీకొట్టడంతో పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. బహానగా రైల్వేస్టేషన్లో ఈ మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో దాదాపు 295 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మందికిపైగా గాయపడ్డారు. బోగీల మధ్య చిక్కుకున్న మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేకుండా మారాయి. దీంతో వాటిని గుర్తించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా 28 మృతదేహాలను గుర్తించలేకపోయారు. దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రమాదం జరిగిన తరువాత నుంచి ఎయిమ్స్‌కు రెండు విడతల్లో 162 మృతదేహాలను తరలించారు. వాటిలో 28 మృతదేహాలు ఎవరూ తీసుకెళ్లకపోవడంతో ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ఎయిమ్స్‌లోని మృతదేహాలను సీబీఐ అధికారులకు అప్పగించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని