దెయ్యాలు ఆవహించాయని నవ వధువుపై అత్యాచారం.. నకిలీ బాబా అరెస్టు

భూత వైద్యం పేరుతో నవ వధువుపై అత్యాచారం చేసిన నిందితుడిని బండ్లగూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 04 Sep 2023 22:16 IST

హైదరాబాద్‌: భూత వైద్యం పేరుతో నవ వధువుపై అత్యాచారం చేసిన నిందితుడిని బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ బాబాను పట్టుకోవడం కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు కొన్నిరోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్‌ వద్ద పట్టుకున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తామని ఏసీపీ మనోజ్ కుమార్ వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..?

హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్‌ విద్యార్థినికి తలాబ్‌కట్ట భవానీనగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తితో 3 నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించింది. దుష్టశక్తులు ఆవహించాయన్న అనుమానంతో తల్లి సూచన మేరకు భర్త ఆమెను మొదట బర్కత్‌పురలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లి పూజలు చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో జులై మొదటివారంలో పాతబస్తీ బండ్లగూడ రహ్మత్‌నగర్‌లోని తాంత్రికుడు మజహర్‌ఖాన్‌ (30) వద్దకు తీసుకెళ్లారు. ఆమెను 5 దెయ్యాలు ఆవహించాయని, వదిలించేందుకు పూజలు చేయాలని చెప్పాడు. మొదట తలాబ్‌కట్టకు వచ్చి బాధితురాలి ఇంటిని పరిశీలించాడు. 

వివస్త్రను చేసి నూనే రాస్తూ..

రెండు రోజుల తరువాత తన ఇంటికి రావాలని కోరాడు. బాధితురాలు తన భర్తతో కలిసి బండ్లగూడలోని నకిలీ బాబా ఇంటికొచ్చింది. ఆమె నడుము చుట్టూ దారం కట్టాలని, కళ్లకు గుడ్డ కట్టాలని భర్తకు చెప్పాడు. అలా చేసి పూజలంటూ భర్తను బయటకు పంపాడు. బాధితురాలిని పడుకోబెట్టి నూనె వేసి మర్దనం చేశాడు. తరువాత వివస్త్రను చేసి శరీరం అంతా నూనె రాస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత పాలతో శరీరం కడిగి నూతన వస్త్రాలు ధరించాలని చెప్పాడు. ఇక్కడ జరిగిన పూజ విషయాలు ఎవరికీ చెప్పొద్దని, అలా చెబితే అనర్థాలు జరుగుతాయని భయపెట్టాడు.

సీఐ బదిలీ కావడంతో..

ఇంటికి వెళ్లిన బాధితురాలు మొత్తం చెప్పేసి ఠాణాలో ఫిర్యాదు చేద్దామంటే వద్దంటూ ఆమెను కుటుంబసభ్యులు ఓ గదిలో బంధించారు. 10 రోజుల తరువాత ఇంటికి వచ్చిన సోదరికి విషయం చెప్పి ఠాణాలో ఆగస్టు 19న ఫిర్యాదు చేసింది. అప్పటి ఇన్‌స్పెక్టర్‌ అమ్జద్‌అలీ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మజహర్‌ఖాన్‌ మహారాష్ట్రకు పరారయ్యాడు. సీఐ బదిలీ కావడంతో కేసులో పురోగతి లేదు. బాధితురాలి ఒత్తిడితో భవానీనగర్‌ పోలీసులు ఆగస్టు 22న కేసును బండ్లగూడ ఠాణాకు బదిలీ చేశారు. ఎట్టకేలకు నిందితుడిని ఇవాళ పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని